ట్రంప్ పదవికి ముంచుకొస్తున్న ముప్పు
By Newsmeter.Network Published on 6 Dec 2019 12:48 PM GMT- పదవీచ్యుతి ఘడియలు దగ్గరపడినట్టేనా?
- అభిశంసన తీర్మానంపై స్పీకర్ వివరణ
- లెక్కపెట్టేది లేదంటున్న డోనాల్డ్ ట్రంప్
- తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమంటూ డోనాల్డ్ ట్రంప్ సవాల్ !
అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం అంతకంతకూ రసకందాయంలో పడుతోంది. అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారంటూ వస్తున్న వార్తలను స్పీకర్ నాన్సీ పెలోసీ ధృవీకరించడంతో దానికి సంబంధించిన అనుమానాలన్నీ పూర్తి స్థాయిలో నివృత్తి అయినట్టే.
అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టని పక్షంలో అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని, తనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితిని స్వయంగా డోనాల్డ్ ట్రంప్ కలగజేస్తున్నారని స్పీకర్ వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశంగా మారింది. క్రిస్మస్ పండుగ లోగానే డెమొక్రాట్లు అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవిస్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టొచంటూ ఆమె బాంబు పేల్చారు.
ట్రంప్ ను అధ్యక్షపదవి నుంచి కిందికి దింపేసే చట్టపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని, డ్రాఫ్టింగ్ పూర్తవగానే సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని స్పీకర్ చెప్పారు. అత్యంత బాధాకరమైన అంశమే అయినప్పటికీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురయ్యిందని ఆమె అన్నారు.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలు పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినవేనని పెలోసీ తెలిపారు. డెమొక్రాట్లపైన, తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్ పైన చట్టవ్యతిరేకంగా పరిశోధన చేయించమని ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ అయిన సందర్భంలో ట్రంప్ ఆయనను కోరినట్టుగా అభియోగం మోపబడింది.
ట్రంప్ తన స్వలాభంకోసం ఎన్నికల్లో భారీస్థాయి అవినీతికి తెరలేపుతున్న సందర్భంలో ఆయనపై అవిస్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మినహా తమకు మరో దారి లేదని స్పీకర్ ఆరోపించారు. స్వలాంభకోసం ట్రంప్ జాతీయ భద్రతను పణంగా పెడుతున్నరని, అంతర్జాతీయ సమాజాన్ని బలవంతంగా తనవైపునకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని, తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపణాస్త్రాలను సంధించారు.
ఉక్రెయిన్ వ్యవహారంలో చట్ట సభల అనుమతి మేరకు పూర్తి స్ధాయిలో ట్రంప్ పై విచారణ జరిపితే అనేక నిజాలు నిగ్గు తేలతాయని పెలోసీ అంటున్నారు. దీనికి సంబంధించి తయారు చేస్తున్న అభిశంసన తీర్మానానికి సంబంధించిన పత్రాలను డెమొక్రటిక్లకు చెందిన ముగ్గురు లీగల్ స్కాలర్లు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ పత్రాలను చట్ట సభకు సమర్పించిన తర్వాత ట్రంప్ నిజస్వరూపం బహిర్గతమవుతుందని వాళ్లు వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోపక్క ట్రంప్ ఈ ఆరోపణలను లెక్కచేయడంలేదు. డెమొక్రాట్లకు నిజంగా దమ్ముంటే వెంటనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని, మరోసారి ఎన్నికల రణరంగంలో తాడో పేడో తేల్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.
ట్రంప్ పై బురదజల్లేందుకే రాజకీయ ప్రత్యర్థులు ఈ ఆరోపణలు చేస్తున్నారని రిపబ్లికన్లు అంటున్నారు. నిజానికి ట్రంప్ మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడానికి సరిపడా సమయం వారి దగ్గర లేదని, ఏదో కంగారుగా తయారుచేసిన డ్రాప్ట్ ను సభలో ప్రవేశపెట్టి డెమొక్రాట్లు వాళ్ల చేత్తో వాళ్ల కన్నే పొడుచుకునే పరిస్థితి వస్తుందని ధీమాగా చెబుతున్నారు.
జాతీయ రక్షణ, భద్రత పేరుతో ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్ధులపై కక్షసాధింపు ధోరణులకు తెగబడుతున్నారని డెమొక్రాట్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 2 ట్రంప్ కు తన ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరించే అధికారాన్ని కట్టబెట్టలేదని పమెల్లా ఎస్. కార్లన్ అంటున్నారు. ట్రంప్ పూర్తి స్థాయిలో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
విచారణలో ఆమె ట్రంప్ తనయుడు మైనర్ బాలుడు అయిన బారన్ పేరును ప్రస్తావించడం మరింత గందరగోళానికి దారి తీసింది. ట్రంప్ అర్ధాంగి మెలనియా దాన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. పిల్లలను రాజకీయాల్లోకి ఈడ్చి రచ్చ చేయాల్సిన అవసరంలేదంటూ ఆమె ఘాటుగా స్పందించడంతో పరిస్థితి మరింత సీరియెస్ గా మారింది. రాజకీయ స్వార్థంకోసం పమెల్లా ఎస్. కార్లన్ తన తనయుడిని అనవసరపు వివదాలకు జోడించే ప్రయత్నం చేస్తున్నారని అమెరికా ఫస్ట్ లేడీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.