అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌తీయుడి ఘ‌న‌విజ‌యం.. సుందర్ పిచాయ్‌కు మరో కీలక బాధ్యత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Dec 2019 10:56 AM GMT
అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌తీయుడి ఘ‌న‌విజ‌యం.. సుందర్ పిచాయ్‌కు మరో కీలక బాధ్యత

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ కు మరో కీలక బాధ్యత అప్ప‌గించారు గూగుల్‌ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌. వారి మాతృసంస్థ అల్ఫాబెట్ బాధ్య‌త‌ల‌ నుంచి తప్పుకుని.. ఆ కంపెనీ బాధ్యతలు కూడా సుందర్ పిచాయ్‌కు అప్పగించారు. ఇక పై ఆల్ఫాబెట్ పరిధిలోని అన్ని సంస్థలకు సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

సుధీర్ఘ కాలంగా కంపెనీ వ్యవహారాలు మోసిన మేము.. ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ప్రకటించారు. ఇక‌నుండి సంస్థకు కేవ‌లం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని ప్ర‌క‌టించారు.

కొత్త బాధ్య‌త‌లపై సుందర్ పిచాయ్ మాట్లాడుతూ,.. గూగుల్ మీద ఫోకస్ పెడుతూనే వీలైనంత వరకూ ప్రతి ఒక్కరికీ అల్ఫాబెట్ ఉపయోగపడేలా సేవలు అందిస్తాం. అల్ఫాబెట్ లాంటి బిగ్ ఛాలెంజ్ తీసుకోవడం ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నా. అందరికీ థ్యాంక్స్' అని పిచాయ్ అన్నారు.

ఇదిలావుంటే.. సుంద‌ర్ పిచాయ్ 1972 జూన్ 10న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఖరగ్ పూర్‌లోని ఐఐటీలో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. అనంత‌రం గూగుల్ సంస్థ‌లో చేరి వివిధ హోదాల్లో పనిచేస్తూ సీఈవో స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు సంస్థ అధిప‌తులు ఏకంగా ఆల్ఫాబెట్‌కు అధిపతిని చేశారు.

Next Story