ఆమె 26 ఏళ్లుగా క్వారంటైన్ లోనే.. ఎందుకంటే
By రాణి Published on 3 April 2020 12:22 PM ISTక్వారంటైన్ అంటే..15 రోజులు, 21 రోజులు..లేకపోతే నెలరోజులు క్వారంటైన్ లో ఉంటారు. కానీ ఈమె మాత్రం తన జీవితకాలంలో 26 ఏళ్లు క్వారంటైన్ లోనే ఉంది. అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది ? ఆమెకు ఇంతకుముందే కరోనా సోకిందా అనుకుంటున్నారా ? కరోనా సోకితేనే క్వారంటైన్ లో ఉండాలని లేదు. ఎలాంటి అంటువ్యాధి అయినా క్వారంటైన్ లోనే ఉంచుతారు. కానీ ఆమెకొచ్చింది అంటువ్యాధి కాదు. టైఫాయిడ్ జ్వరం. ఏంటి టైఫాయిడ్ వస్తే 26 ఏళ్లు బలవంతంగా క్వారంటైన్ లో ఉంచారా ? అని ఆశ్చర్యపోతున్నారా. అసలు అలా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో..తెలుసుకుందాం..
ఆమె పేరు మేరీ మాలన్. 1886లో నార్త్ ఐర్లాండ్ లో పుట్టిన మేరీ 1884లో కుటుబంతో కలిసి అమెరికాకు వలస వచ్చింది. న్యూయార్క్ లోని కొన్ని ఇళ్లలో వంటమనిషిగా పనిచేసింది. 1901లో మమరొనెక్ ప్రాంతంలో మేరీ పనిచేరిన ఓ ఇంట్లో కుటుంబ సభ్యులంతా టైఫాయిడ్ బారిన పడ్డారు. దీంతో అక్కడ పని మానేసి మాన్ హట్టన్ లోని వేరే వారింట్లో పనికి చేరింది. అక్కడకూడా మేరీ వెళ్లిన కొద్దిరోజులకే ఇంటి యజమాని సహా అందరికీ టైఫాయిడ్, డయేరియా వచ్చింది. అదే ఇంటిలో చాకలిగా పనిచేసే ఒకరి ప్రాణాలు కూడా పోయాయి. దీంతో మేరీ అక్కడ కూడా పనిమానేసింది. తిరిగి 1906 లో ఒయిస్టర్ బే ప్రాంతంలోని నలుగురు ఇళ్లలో మళ్లీ పనికోసం వెళ్లింది. ఆ నాలుగు ఇళ్లలో వారు కూడా టైఫాయిడ్ తో ఆస్పత్రుల పాలయ్యారు. ఇలా తను ఏ ఇంటికి పనికెళ్లినా ఆ ఇంట్లోవారంతా ఎందుకు టైఫాయిడ్ తో ఆస్పత్రులకు వెళ్తున్నారో అర్థంకాలేదు మేరీకి. అలా అనుమానంగా..ఆఖరిగా న్యూయార్క్‌లో ఉండే ఛార్లెస్ హెన్రీ వారెన్ అనే బ్యాంక్ అధికారి ఇంట్లో వంట మనిషిగా చేరింది. కొంతకాలానికి అతను ఒయిస్టర్ బేకి మారడంతో వాళ్లతోపాటు ఆమె కూడా వెళ్లింది. ఆ ఇంట్లో వారు కూడా మేరీ పనికిచేరిన రెండువారాలకే టైఫాయిడ్ బారిన పడటంతో..ఈ విషయం అంతటా పాకి చర్చనీయాంశంగా మారింది. ఒయిస్టర్ బే లోనే అతితక్కువ సమయంలో చాలా కుటుంబాలకు టైఫాయిడ్ రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయినా మేరీ ఈ విషయం పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించింది.
సాల్మనెల్లా టైఫీతో టైఫాయిడ్
అసలు టైఫాయిడ్ జ్వరం ఎందుకొస్తుంది అంటే..సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా కలిసిన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఈ బాక్టీరియా సోకిన వ్యక్తులు వాడిన వస్తువులను మరొకరు వాడటం, ఆ వస్తువుల్లో ఆహారం తినడం ద్వారా కూడా టైఫాయిడ్ వ్యాపించే అవకాశాలున్నాయి. మేరీకి ఈ రకమైన బాక్టీరియా ఉంది. ఆమె వంటమనిషిగా పనిచేస్తుండటంతో ఆమె వాడిన వస్తువుల్లోనే ఆ ఇంట్లో మనుషులు కూడా వాడటంతో వారందరికీ టైఫాయిడ్ సోకింది.
ఒయిస్టర్ బే లో టైఫాయిడ్ సోకిన కుటుంబాల ఇళ్లలో ప్రధానంగా మేరీ పేరు వినిపించింది. దీంతో 1906లో మేరీ పనిచేసిన ఓ కుటుంబం తమకు టైఫాయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు జార్జి సొపర్ అనే పరిశోధకుడిని నియమించింది. అతడి పరిశోధనలో మేరీ వల్లే టైఫాయిడ్ వచ్చినట్లు అనుమానించాడు. ఆ అనుమానానికి బలం చేకూర్చేలా..స్థానికంగా మరిన్ని టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. వారి ఇళ్లకు వెళ్లగా..మేరీ అక్కడ వంటమనిషిగా చేసినట్లు తెలుసుకున్నాడు. ఓ ఇంట్లో పనిచేస్తున్న మేరీని సోపర్ కలిసి..తనతో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. అందుకు మేరీ ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్లకు జ్వరం రావడానికి తనకూ సంబంధం ఏమిటని ప్రశ్నించింది. దీంతో సోపర్ బలమైన సాక్ష్యాల కోసం మేరీ పనిచేసిన ఇళ్లకు వెళ్లి..వారందరినీ విచారణ చేశాడు. మేరీ వల్లే వారందరికీ టైఫాయిడ్ సోకిందని నిర్థారించుకున్నాడు. డాక్టర్ ము వెంటబెట్టుకుని మేరీ వద్దకు వెళ్లగా..మళ్లీ వైద్య పరీక్షలకు సహకరించలేదు.
మొదటిసారి మూడు సంవత్సరాలు క్వారంటైన్
ఆ తర్వాత న్యూయార్క్‌లో టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో విచారణ చేసిన న్యూయార్క్ హెల్త్ ఇన్ స్పెక్టర్ కూడా మేరీనే కారణమని గుర్తించి 1907లో వివిధ సెక్షన్ల కింద మేరీని అరెస్ట్ చేసి క్వారంటైన్ చేశారు. తర్వాత బలవంతంగా నార్త్ బ్రదర్ ఐలాండ్ లోని ఓ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా..టైఫాయిడ్‌కు కారణమైన సాల్మనెల్లా టైఫీ అనే బాక్టీరియా మేరీ పిత్తాశయంలో ఆవాసం ఏర్పాటు చేసుకుందని తేలింది. దీంతో ఆమె ద్వారానే టైఫాయిడ్ సోకుందని వైద్యులు నిర్థారించారు. కానీ ఈ విషయాన్ని మేరీ ఒప్పుకోలేదు. టైఫాయిడ్ తనవల్ల వ్యాప్తి చెందట్లేదని వాదించింది. వంటమనిషిగా చేస్తున్న పనైనా మానుకోవాలని చెప్పగా..అందుకు కూడా ఒప్పుకోకపోవడంతో 3 సంవత్సరాలు బలవంతాన నిర్బంధించారు.
కొంతకాలానికి హెల్త్ కమిషనర్ ఎక్కువరోజులు ఆమెను క్వారంటైన్ చేయడం మంచిది కాదని తలచి..వంటపని చేయకుండా..ఇతరులకు టైఫాయిడ్ వ్యాప్తి చెందకుండా తగుజాగ్రత్తలు పాటిస్తానని మేరీ నుంచి మాట తీసుకుని 1910, ఫిబ్రవరి 19న విముక్తి ఇచ్చారు. ఆస్పత్రి క్వారంటైన్ నుంచి బయటికొచ్చిన మేరీ న్యూ యార్క్ కు చేరుకుంది.
మళ్లీ పాతవృత్తికే..23 ఏళ్లు క్వారంటైన్
చెప్పిన మాట ప్రకారం వంటపని మానేసి..చాకలి వృత్తిని ఎంచుకుంది. ఐదేళ్లపాటు చాకలిగానే పనిచేసిన మేరీ..తక్కువ జీతం వస్తుండటంతో అసంతృప్తికి గురైన తిరిగి మళ్లీ పాతవృత్తిలోకి వెళ్లింది. అలా కొన్ని ఇళ్లలో వంటమనిషిగా చేరి..ఆ ఇళ్లలో వారికి టైఫాయిడ్ రావడానికి కారణమైంది. ఈ విషయం 1915లో బయటపడింది. ఆ ఏడాది పెద్దసంఖ్యలో టైఫాయిడ్ బాధితులు ఆస్పత్రులపాలవ్వడం కలచివేసింది. న్యూయార్క్‌లోని ఓ మహిళా ఆస్పత్రిలో మేరీ పని చేయగా అక్కడ 25 మంది మహిళలకు టైఫాయిడ్ వచ్చింది. అందులో ఇద్దరు మృతి చెందారు. ఇది ఖచ్చితంగా మేరీ పనేనని గ్రహించిన పోలీసులు 1915, మార్చి 27న ఆమెను అరెస్ట్ చేసి నార్త్ బ్రదర్ ఐలాండ్ లోని ఆస్పత్రిలో క్వారంటైన్ కు పంపారు. ఈసారి ఏకంగా 23 ఏళ్లు క్వారంటైన్ లోనే ఉంది. బయటికొచ్చేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అలా క్వారంటైన్ లో ఉంటూనే మేరీ మరణించింది. ఆ తర్వాత ‘‘టైఫాయిడ్ మేరీ’’ పేరుతో పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 1993లో ఓ డాక్యుమెంటరీ చిత్రం కూడా వచ్చింది.
కాగా..మేరీ గురించి తెలుసుకున్న పలు మీడియా ప్రతినిథులు ఆమెను ఇంటర్వ్యూలు చేయడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఐలాండ్ ఆస్పత్రిలో ఉన్న మేరీకి అధికారులు ల్యాబ్ టెక్నీషియన్ బాధ్యతలు అప్పగించగా..ఆ పనిచేసుకుంటూ అక్కడే కాలం వెళ్లదీసింది. 1932 లో పక్షవాతం రావడంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది. అలా ఆరేళ్లు గడిచాక 1938, నవంబర్ 11న న్యూమోనియాతో మరణించింది. ప్రభుత్వ అధికారులే ఆమె అంత్యక్రియలు పూర్తి చేసి బ్రాంక్స్‌లోని సెయింట్ రేమాండ్స్ స్మశానంలో సమాధి నిర్మించారు.