పది రోజుల్లో పెళ్లి.. ఇద్దరు యువతుల ఆత్మహత్య..
By Newsmeter.Network
హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. హయత్‌నగర్ లోని రాఘవేంద్ర కాలనీలో నివసించే మమత(20), గౌతమి (21) స్నేహితురాళ్లు. కాగా మమతకు మరో పది రోజుల్లో వివాహాం జరగనుంది.
మమత తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్‌కు ఓ శుభకార్యం నిమిత్తం వెళ్లారు. ఆమె సోదరుడు పాఠశాలకు వెళ్లాడు. అయితే సాయంత్రం 4 గంటలకు ఆమె సోదరుడు వచ్చి చూడగా మమతతో పాటు ఆమె స్నేహితురాలు గౌతమి.. ఇనుపరాడ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. వీరిద్దరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని వారు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. పెళ్లికి కట్నకానుకలు భారీగా ఇవ్వాల్సి వస్తోందని, తద్వారా తల్లిదండ్రులకు భారమైపోయామని, మరే ఆడపిల్లలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతుల ఆత్మహత్యకు గల కారణాలపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.