పిడుగు పడి.. ఇద్దరు టీనేజ్ క్రికెటర్ల మృతి..!
By తోట వంశీ కుమార్ Published on 11 Sep 2020 11:11 AM GMTపిడుగు పడి ఇద్దరు టీనేజ్ క్రికెటర్లు మృతి చెందిన సంఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. డాకాకు చెందిన మహ్మద్ నదీమ్, మిజనుర్ రెహ్మన్ ఇద్దరూ యువ క్రికెటర్లు. గురువారం రోజు స్థానిక మైదానంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ హాజరయ్యారు. ఆ సమయంలో వర్షం పడడంతో.. ప్రాక్టీస్ సెషన్ రద్దు అయ్యింది. దీంతో వారు సరదాగా పుట్‌బాల్ ఆడారు. సరిగ్గా అదే సమయంలో వారిపై పిడుగు పడింది. దీంతో వారిద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన కోచ్ అన్వర్ హుస్సెన్ స్పందించారు. ఓ టోర్నీలో పాల్గొనేందుకు నదీమ్, రెహ్మాన్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా వారిద్దరూ కష్టపడుతున్న తరుణంలో ఇలా జరగడం దారుణమన్నారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.
ఇక బంగ్లాదేశ్‌లో ప్రతీ ఏడాది పిడుగులు పడి వందల మంది మృత్యువాత పడుతుంటారు. ముఖ్యంగా వర్షకాలంలో ఈ మరణాలు అక్కడ సర్వ సాధారణం. ప్రతీ ఏటా సుమారు 350 మంది పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. బంగ్లాదేశ్ విపత్తు శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. 2016 మే నెలలో పిడుగుల కారణంగా ఒకే రోజు 82 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 350 మంది చనిపోయారు.