బంగాళఖాతంలో మరో అల్పపీడనం

By సుభాష్  Published on  2 Oct 2020 3:21 AM GMT
బంగాళఖాతంలో మరో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిసా తీరం, పశ్చిమ మధ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు శుక్ర, శనివారాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓ మోసరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ మరో అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండనున్నాయి. ఇప్పటికే వరదనీటితో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్నాయి.

అలాగే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 14 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువన వదులుతున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 2 లక్షల 53,699 క్యూసెక్కుల ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది.

Next Story