టిటిడి సంచలన నిర్ణయం
By రాణి Published on 19 March 2020 11:01 AM GMTతిరుమల ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కరోనా వ్యాప్తి రెండవ దశలో ఉండటంతో టిటిడి సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం ఆలయ కమిటీ సమావేశంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఈ నెలాఖరు వరకూ ఆలయం మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు మినహా కొండపై ఉన్న భక్తులందరినీ అలర్ట్ చేసి ఖాళీ చేయిస్తున్నారు. నడకమార్గాన్ని కూడా మూసివేశారు. ఘాట్ రోడ్డు మార్గాన్ని రేపు ఉదయం నుంచి మూసివేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. అయితే స్వామివారికి జరగాల్సిన నిత్యపూజలు మాత్రం యథాతథంగా జరుగుతాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మహారాష్ర్టకు చెందిన వ్యక్తి కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కొండపైకి ఖాళీ బస్సులు తప్ప.. మరేఇతర వాహనాలను అనుమతించడం లేదు.
Also Read : నిర్భయ దోషులకు రేపే ఉరి ?
ఇప్పటికే కొండ ప్రాంతాన్నంతటినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండపైన సిబ్బంది వైరస్ ప్రబల కుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భక్తులు తిరగాడిన అన్ని ప్రాంతాల్లోనూ స్ర్పేలు, బ్లీచింగ్ పౌడర్లు జల్లుతున్నారు. తిరుమలకు రావాలనుకుంటున్న భక్తులు సైతం తమతమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా టిటిడి కోరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకునే చర్యల్లో భాగంగానే ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి భక్తులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రెండు కరోనా కేసులు నమోదవ్వగా..తెలంగాణలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read : కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు వాయిదా