పృథ్వీ ఆడియో టేపుల కలకలం.. విచారణకు ఆదేశించిన టీటీడీ చైర్మన్‌

By Newsmeter.Network  Published on  12 Jan 2020 10:46 AM GMT
పృథ్వీ ఆడియో టేపుల కలకలం.. విచారణకు ఆదేశించిన టీటీడీ చైర్మన్‌

తిరుపతి: పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారంపై టీటీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్వీబీసీ చైర్మన్‌ ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని ప్రముఖ ఛానెల్‌కు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పృథ్వీతో ఈ ఆరోపణలపై మాట్లాడానని, ఓ వర్గం తనను టార్గెట్‌ చేశారని పృథ్వీ చెప్పాడని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తన వాయిస్‌ను మార్ఫింగ్‌ చేశారని పృథ్వి తెలిపారని, ఎస్వీబీసీ ఛానల్‌ టీటీడీలో భాగమేనని సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీ ఛానెల్‌ ఎంతో మంది వీక్షిస్తారన్నారు. పృథ్వీ తప్పు చేసుంటే చర్యలు తీసుకుంటామని, నివేదిక వచ్చాక పృథ్వీ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా పృథ్వీపై చర్యలు తీసుకోలేమని సుబ్బారెడ్డి వివరించారు. అలిపిరి ఎస్వీబీఎస్‌ ఆఫీస్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రామకిశోర్‌ నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. పృథ్వీ వ్యవహారశైలి గురించి తోటి ఉద్యోగులను కలిసి ఆరా తీస్తున్నారు.

ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ పేరిట విడుదలైన ఫోన్‌ సంభాషణ తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్‌ మీడియాలో ఆడియో టేపులు వైరల్‌గా మారాయి. పృథ్వీరాజ్‌ వ్యవహరశైలిపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. పృథ్వీని వెంటనే ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. పృథ్వీరాజ్‌ను తొలగించాలని లేదంటే రేపు ఉదయం టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని మహిళా సంఘాలు అంటున్నాయి. పృథ్వీపై మహిళలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story