పండుగ స‌మ‌యం.. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డతారు.. విధుల్లోకి రండి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 1:07 PM GMT
పండుగ స‌మ‌యం.. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డతారు.. విధుల్లోకి రండి..

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ఐఏఎస్ ల త్రిసభ్య కమిటీ మీడియా సమావేశం నిర్వ‌హించింది. ఆర్టీసీ జేఏసీ కమిటీతో మూడు సార్లు సమావేశం అయ్యామ‌ని ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ అన్నారు. 26 డిమాండ్లను ప్రభుత్వంతో చర్చిస్తామ‌ని ఆర్టీసీ జేఏసీతో చాలా క్లియర్ గా చెప్పామ‌ని తెలిపారు. డిమాండ్ ల పరిష్కారానికి టైం ఇవ్వండని అడిగామ‌ని.. అన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉందని సోమేశ్ కుమార్ అన్నారు. సమ్మె ద్వారా పండగ సమయాన ప్రజలు ఇబ్బంది పడతారని.. సమ్మె వాయిదా వేసుకోండి అని చెప్పామన్నారు. అయితే.. జేఏసీ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామ‌ని రాత పూర్వక హామీ ఇవ్వాల‌ని అడిగార‌న్నారు.

సమ్మెను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసామ‌ని త్రిసభ్య కమిటీలోని మ‌రో ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ అన్నారు. సమ్మె అనివార్యమైతే ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసామ‌ని తెలిపారు. 2100 ప్రైవేటు బస్సులు నడుపుతున్నామ‌ని.. అన్ని స్కూళ్ల‌కి సెలవులు ఉన్నందున ప్రైవేటు స్కూల్ బస్సులు కూడా నడుపుతున్నామ‌న్నారు. ప్రైవేటు స్కూల్ బ‌స్సుల‌కు కేవలం 100 రూపాయలకు ఒక రోజు చొప్పున పర్మిషన్ ఇస్తున్నామ‌న్నారు. ఓలా, ఉబర్ క్యాబ్ వాళ్ళకి కూడా ఎక్కువ చార్జీలు వసూలు చేసుకోకుండా వాహనాలు నడపాలని చెప్పామ‌న్నారు. ఈరోజు అన్ని పేపర్ లలో ప్రకటన ఇచ్చామ‌ని.. ఈ సమయంలో మీరు సమ్మెకు వెళ్తే.. ఎస్మా ఉండడం ద్వారా డిస్మిస్ కూడా అవుతారని కార్మికులను హెచ్చ‌రించారు. మీరు మంచిగా పని చేస్తే తర్వాత మంచి జరుగుతుందని హితువు ప‌లికారు. స‌మ్మె చేస్తే వెంటనే కొత్త రిక్రూట్‌మెంట్ కూడా చేస్తామ‌ని అన్నారు.

కార్మికులు ప్రతి ఒక్కరు సహకరించాలని త్రిసభ్య కమిటీలోని మ‌రో ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు అన్నారు. ప్రభుత్వం ప్రజా రవాణా కోసం గత 5 సంవత్సరాల‌లో తెలంగాణ వచ్చిన తరువాత 3303 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడం జరిగిందన్నారు. సంస్థకు మరింత సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. బడ్జెట్ లో ఇవ్వాల్సిన దానికంటే అధికంగా నిధులు కేటాయించామన్నారు. ఆర్టీసీ జేఏసీ పెట్టిన 26 డిమాండ్ లలో కొన్ని ఆర్థికానికి సంబంధించినవి ఉన్నాయని.. పక్క రాష్ట్రం వాళ్ళు ఏం చేశారు.. మేము ఎలా చేయాలి అన్న‌ దానిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎవరైనా డ్యూటీ చేయాలనుకునే వాళ్ళు వచ్చి డ్యూటీ చేయాలని.. వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. సమ్మె ఇల్లీగల్ గా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు విధుల్లోకి రావాలి అని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ లతో, ఎస్పీలతో మాట్లాడామ‌ని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంధులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు త్రిసభ్య కమిటీ సభ్యులు.

Next Story