అభయారణ్యాల్లో రోడ్లు, రైలు మార్గాలు.. పులుల కోసం వద్దంటున్న జంతు ప్రేమికులు

By అంజి  Published on  23 Feb 2020 6:55 AM GMT
అభయారణ్యాల్లో రోడ్లు, రైలు మార్గాలు.. పులుల కోసం వద్దంటున్న జంతు ప్రేమికులు

హైదరాబాద్: 'అభయారణ్యాల్లో రోడ్లకు.. రైలు మార్గాలకు ఒకే' అంటూ ప్రముఖ దినపత్రిక సాక్షి కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. టైగర్‌ ఫారెస్ట్‌ జోన్‌లలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. కుమ్రంభీం అసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలోని మంచిర్యాల-చంద్రపూర్‌ మార్గంలో నేషనల్‌ హైవే 363 రోడ్డును 94 కిలోమీటర్ల మేర ఫోర్‌లేనింగ్‌గా మార్చాలన్న ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

జంతుప్రేమికుల ఆందోళన

ఇటీవల కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర వన్యప్రాణి మండలి ఈ నెల 1న జరిగిన సమావేశంలో ఆమోదముద్ర వేసిందని సాక్షి దినపత్రిక తెలిపింది. అయితే ఈ చర్యలపై జంతుప్రేమికులు, పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పులుల సంరక్షణతో పాటు ఇతర జంతువులకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, రైల్వే లైన్ల ఏర్పాటుపై మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు.

డబ్ల్యూఎల్‌ఎం వరంగల్‌ డివిజన్‌లోని ఉరాట్టం-ఐలాపురం రోడ్డు అప్‌గ్రెడేషన్‌కు 31.759 హెక్టార్ల అటవీభూమిని వాడుకునేందుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగరం, వెంకటాపురం ఫారెస్ట్‌ డివిజన్ల పరిధిలోని తుపాకుల గూడెం గ్రామం వద్ద పి.వి.నరసింహారావు కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్‌-1, ప్యాకేజీ వన్‌లో భాగంగా గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణానికి 27.9133 హెక్టార్ల అటవీ భూమి మళ్లీంపుకు వన్యప్రాణిమండలి ఆమోదం తెలిపిందని.. తన కథనంలో పేర్కొంది.

అలాగే కుమ్రంబీం జిల్లా ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని మాఖుది, రేచ్ని రోడ్డు, రైల్వేస్టేషన్ల మధ్య కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో మూడో కొత్త బ్రాడ్‌గేజ్‌నే లైన్‌ ఏర్పాటుకు ఒకే చెప్పింది. ఇందుకు 168.43 హెక్టార్ల అటవీభూమి మళ్లించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అయితే పులులకు తిరగాడే ప్రాంతాల్లో, వాటికి ఆవాసలైన చోట రోడ్ల విస్తరణ, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టం సరికాదని జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు అంటున్నారు. మహారాష్ట్రలోని తడోబా అంథేరి టైగర్‌ రిజర్వ్‌ నుంచి తెలంగాణకు పులుల వలస మొదలైంది.

కవ్వాల్‌ టైగర్‌ ఫారెస్ట్‌లో పులులు పిల్లలు కూడా పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో పులుల వృద్ధికి, వాటి జీవనానికి, వలసలకు విఘాతం కలిగేలా నిర్మాణాలు చేపట్టడం సరికాదని జంతుప్రేమికులు అంటున్నారు. అయితే వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే ఆమోదముద్ర వేసినట్టుగా రాష్ట్ర వన్యప్రాణిమండలి సభ్యులు చెబుతున్నారు.

Next Story