పురపోరు ఎన్నికల వేళ.. రాజకీయ 'పెళ్లిళ్ల గోల'..!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 7:29 AM GMT
పురపోరు ఎన్నికల వేళ.. రాజకీయ పెళ్లిళ్ల గోల..!

ఎన్నికల కాలం వచ్చేసింది. ఎన్నికల కాలంలో పార్టీల పరిస్థితి భర్తతో బండిలో వెళ్తూ ప్రియుడికి వాట్సప్ మెసేజ్ పంపినట్టు ఉంటుంది. ముద్దులొకరికి, మెసేజ్ ఇంకొకరికి. ఓట్ల పండుగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్లు పార్టీలు కొత్త పొత్తులు కుదుర్చుకుంటారు. కొన్ని సక్రమ సంబంధాలు అంటే ప్రత్యక్ష పొత్తులైతే, మరికొన్ని అక్రమ సంబంధాలు అంటే పరోక్ష పొత్తులు.

ఇప్పుడు పురపాలక సంఘాల ఎన్నికల వేళ కూడా ఇలాంటి వింత వ్యవహారాలే దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరుకు ఒంటరి పోరు చేస్తోంది. కానీ అవసరమైన చోట మాత్రం, స్థానిక ఏర్పాట్లలో భాగంగా టీఆర్‌ఎస్‌, బిజెపిలు తప్ప మరే ఇతర పార్టీతోనైనా రహస్య లేదా బహిరంగ అవగాహన కుదుర్చుకోవచ్చునని ఆదేశించింది. వామపక్షం సీపీఐ మాత్రం ఒక్క బిజెపి విషయంలోనే “మడి” కట్టుకొమ్మని తమ పార్టీ అభ్యర్థులకు సూచించింది. వీలును బట్టి అటు కాంగ్రెస్ తో, ఇటు టీఆర్‌ఎస్‌తో కూడా అవకాశవాదపు పొత్తులు పెట్టుకోవచ్చునని సలహా ఇచ్చింది. సీపీఎం పాతివ్రత్యం పాటిస్తోంది. అంటే సీపీఐ తప్ప మరే ఇతర పార్టీతోనూ అవగాహన కుదుర్చుకునే ప్రసక్తే లేదు. అయితే సీపీఐ ఎవరితోనైనా అవగాహన కుదుర్చుకుంటే మాత్రం చూసీ చూడకుండా వదిలేస్తోంది. ఇక టీడీపీ పరిస్థితి మరింత విచిత్రం. టీఆర్‌ఎస్‌ తప్ప ఎవరితోనైనా రాజకీయ “తుప్ప”ల్లోకి వెళ్లేందుకు టీడీపీ సిద్ధం. అంటే బిజేపీ తో కూడా టీడీపీ ఓకే అన్న మాట. మరో మాటలో అసెంబ్లీ ఎన్నికల మహా కూటమి ఇప్పుడు మటాశ్. ఇక అధికార టీఆర్ఎస్‌కి ఇప్పటికే ఎంఐఎంతో పెళ్లి అయిపోయింది. కానీ సమస్యేమిటంటే ఈ సినీ హీరోయిన్లా పెళ్లి జరిగిందని బహిరంగంగా టీఆర్ఎస్‌ చెప్పుకోలేదు. చెప్పుకుంటే ఉన్న హిందూ ఓట్లు పోయే ప్రమాదం.

అన్నిటికన్నా తమాషా పరిస్థితి టీజేఎస్‌ది. టీజేఎస్ అంటే ఏమిటి అని మాత్రం అడగకండి. టీ జే ఎస్ అంటే తెలంగాణ జనసమితి. ప్రొ.కోదండరామ్ పార్టీ అది. అది మాత్రం ఒంటరిపోరు చేయబోతోందట. ఎవరితో కలవదట. మొత్తం మీద ఎన్నికల వేళ్ల రాజకీయ పార్టీల మధ్య పొత్తుల గోల కోనసాగుతోంది.

Next Story