రేపే తెలంగాణ 'మునిసిపల్‌'పోరు.. ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌తో..

By అంజి  Published on  21 Jan 2020 9:33 AM GMT
రేపే తెలంగాణ మునిసిపల్‌పోరు.. ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌తో..

రేపు జరగనున్న తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల అధికారులు ఇవాళ సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకోనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పోలింగ్‌ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు ఓటింగ్‌ ముగిసేవరకు పహారలో ఉండనున్నారు.

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 45 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. మొత్తం 53,36,505 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,71,694 మంది ఉండగా…26,64,557 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6.40 లక్షల మంది ఓటర్లు, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు గాను ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులను గాను 80 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. డబీర్‌పురా డివిజన్‌కు మాత్రం ఉప ఎన్నిక జరగనుంది.

ఈ ఎన్నికల ప్రక్రియ కోసం ఇప్పటికే 120 మున్సిపాలిటీల్లో 6,325 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అలాగే 9 కార్పొరేషన్లలోని 1,586 పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా కరీంనగర్‌లో ఈ నెల 24న ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రేపటి వరకు ఎన్నికల ప్రచారం జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమలు చేయబోతోంది. ఓటు వేసే సమయంలో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనిని ఫైల్‌ ప్రాజెక్టు కింద కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అమలు చేయనున్నారు.

Next Story