ఓట్లు సమానంగా వస్తే.. లాటరీనే..

By Newsmeter.Network  Published on  24 Jan 2020 12:38 PM GMT
ఓట్లు సమానంగా వస్తే.. లాటరీనే..

రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో బుధవారం ఎన్నికలు జరగగా రేపు ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా రేపు జరుగనున్న ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 74.40 శాతం, కార్పొరేషన్లలో 58.83 శాతం పోలింగ్ నమోదైందన్నారు. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయన్నారు. మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు ఈ నెల 27న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని తెలిపారు.

మేయర్, ఛైర్ పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఆయా పార్టీలు ఇవ్వడానికి గడువు తేదీలు వరసగా ఈ నెల 26, 27గా నిర్ణయించామన్నారు. ‘ఏ’ ఫారాలు 26న ఉదయం 11 గంటల్లోపు ఇవ్వాలని, ‘బీ’ ఫారాలు 27న ఉదయం 11 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సాధారణ ఎన్నికల్లో ఉండే ప్రవర్తనా నియమావళి ఈ ఎన్నికలకు కూడా ఉంటుందని, రేపు సాయంత్రం నుంచి ఈ నియమావళి అమల్లోకి రానుందని చెప్పారు. ఈ ఎన్నికలకు పార్టీలు తమ విప్ లను నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఇకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఓటు వేయవచ్చని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి చెప్పారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక్కటే మున్సిపాలిటీ ఉంటే అక్కడే ఓటువేయవచ్చని.. అలాకాక ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలుంటే.. ఓటు వేయడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

Next Story
Share it