'అబద్దాల ఈనాడు'.. నమస్తే తెలంగాణ కథనం..

By అంజి
Published on : 23 Feb 2020 11:26 AM IST

అబద్దాల ఈనాడు.. నమస్తే తెలంగాణ కథనం..

హైదరాబాద్‌: 'దొంగలతో దోస్తీ' అంటూ ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనంపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ సీరియస్‌ అయ్యినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. పోలీసు శాఖపై నిరాధార ఆరోపణలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఆధారాలుంటే చూపాలన్న ఆయన.. లేదంటే రూ.1000 కోట్ల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌ వన్‌ అని ఆయన అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రతిష్ట దిగజార్చేందుకే ఈనాడు కుట్రపూరిత కథనం రాసిందని మహమూద్‌ అలీ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అణిచివేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్‌శాఖ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని.. అలాంటి శాఖపై ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని సృష్టించాలన్న దుర్భుద్దితో ఇలాంటి కథనాలు రాయడం సరికాదన్నారు. రాష్ట్రంలో పోలీసుల బదిలీలు, పోస్టింగులపై ఈనాడు తన కథనంలో పేర్కొంది. అయితే ఎవరెవరూ ఎంత తీసుకున్నారని రుజువు చేయాలని మహమూద్‌ అలీ డిమాండ్‌ చేశారు. ఆధారాలు చూపలేకపోతే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. శనివారం నాడు లక్డీకాపూల్‌లోని తన కార్యలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడారు.

తెలంగాణలో శాంతి భద్రతలతో పాటు, మహిళ భద్రత కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనియాడుతుంటే.. కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమ అక్కసును వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. పోలీస్‌శాఖ ఎంతో బాధ్యతాయుతమైనదన్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టామని.. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా సంస్థలపై చర్యలు తప్పవన్నారు. హుస్నాబాద్‌లో మిస్సైన ఏకే-47 గన్‌పై విచారణ సాగుతోందని ఓ ప్రశ్నకు మహమూద్‌ అలీ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 24 గంటల పాటు గస్తీ ముమ్మరం చేశామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా కర్ఫ్యూ విధించలేదని హోంమంత్రి మహమూద్‌ అలీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్ర పోలీసులు పారదర్శకంగా పని చేస్తున్నారు: ఏడీజీ

ప్రజాసంక్షేమం కోసం పోలీసుశాఖ పారదర్శకంగా, 24 గంటల పాటు విధులను నిర్వర్తిస్తోందని అడిషనల్‌ డీజీ జితేంద్ర అన్నారు. పోలీస్‌ శాఖలో అవినీతి అంటూ ఓ దినపత్రిక రాసిన కథనాన్ని ఆయన ఖండించారు. తమపై ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు లేవని అన్నారు. పోలీస్‌శాఖలో బదిలీలు, పోస్టింగులు.. ట్రాక్‌ రికార్డ్‌పై ఆధారపడి జరుగుతున్నాయాన్నారు.

నిరూపించకపోతే చర్యలు తప్పవు: డీజీపీ మహేందర్‌ రెడ్డి

ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ శాఖపై చేసిన ఆరోపణలను నిరూపించకుంటే క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకరిద్దరూ పోలీసులు తప్పు చేస్తే.. ఆ తప్పును మొత్తం పోలీస్‌శాఖకు ఆపాదించడం సరికాదన్నారు.

Next Story