ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్‌

By సుభాష్  Published on  16 Oct 2020 5:57 AM GMT
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు గడువు పొడిగించింది. ఈనెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 2 లక్షల 58వేల మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా 19.33 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2020, అక్టోబర్‌ 15వ తేదీతో గడువు ముగియడంతో మరోసారి గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దరఖాస్తు గడువు పొడిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ను రూపొందించింది. గురువారం నాటికి ప్రభుత్వానికి 18,99,877 దరఖాస్తులు రాగా, ఒక్క రోజే 2.71 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సీఎస్‌ తెలిపారు. ఇందులో గ్రామ పంచాయతీల పరిధిలో 6,67,693 దరఖాస్తులు రాగా, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పోరేషన్‌ పరిధిలో 2,91,066 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్‌ నెలలో సర్కార్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించగా, అక్రమంగా వచ్చిన వెంచర్లలోని ప్లాట్లను క్రమబద్దీకరణ చేసేందుకు తీసుకొచ్చిన లే ఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ ఎంతో మందికి ఉపయోగపడనుంది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోతే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేకపోవడం, నిర్మాణాలకు అనుమతించకపోవడం వంటి నిబంధనలతో యజమానులు ఆందోళన చెందారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.

Next Story