బిగ్‌బ్రేకింగ్: లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 11 April 2020 3:39 PM GMTకరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కోరలు చాస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో 21 రోజుల పాటు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈనెల 14తో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఇక లాక్‌డౌన్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రులు మోదీకి సూచించారు. దీంతో మోదీ కూడా లాక్‌డౌన్‌కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం అనంతరం శనివారం రాత్రి 9 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. లాక్‌డౌన్‌పై కేబినెట్‌లో పలు కీలక అంశాలను చర్చించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారని చెప్పారు. అలాగే 96 మంది కరోనా కేసుల నుంచి కోలుకున్నట్లు చెప్పారు. ఇక 393 మంది చికిత్స పొందుతూ యాక్టివ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక క్వారంటైన్‌లో 1654 మంది ఉన్నారని, ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన 1200 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మర్కజ్ ప్రార్థనల నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నమోదయ్యాయి.
హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనాను కట్టడి చేయాలంటే మరి కొన్ని వారాలు లాక్‌డౌన్ తప్పదని ముందు నుంచే చెబుతూ వస్తున్న కేసీఆర్ తాజా ప్రకటనతో ఈనెల 30 వరకు పొడిగించారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలన్నారు కేసీఆర్. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. రెండు వారాల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.