తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

By సుభాష్  Published on  20 Aug 2020 9:05 AM GMT
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం ఇంతా ఇంతా కాదు. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. వైరస్‌ ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా మిగతా జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఏర్పాటు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆన్‌లైన్‌ బోధన నిర్వహించేందుకు వీలుగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర సర్కార్‌ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సౌకర్యం వల్ల 25 లక్షలకుపైగా పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Next Story