16 జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
By సుభాష్ Published on 20 Aug 2020 4:23 AM GMTతెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురియనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలో కేంద్రీకృతమైంది. 7.6 కిలోమీటర్‌ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ కారణంగా తెలంగాణలోని 16 జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఈ రోజు, రేపు తెలియపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఆగస్టు 23వ తేదీన మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ఇళ్లు, ఆలయాలు పూర్తిగా ముటమునిగిపోయాయి. భారీ వరదలతో ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.