ఆ మార్గాల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం.. శ్రీశైలం భక్తులకు అటవీశాఖ కండీషన్స్‌

By అంజి  Published on  16 Feb 2020 8:21 AM GMT
ఆ మార్గాల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం.. శ్రీశైలం భక్తులకు అటవీశాఖ కండీషన్స్‌

నాగర్‌ కర్నూలు: నల్లమల ఫారెస్ట్‌ మీదుగా శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. తెలంగాణతో పాటు, పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఈ మార్గం గుండా ప్రయాణించే శ్రీశైలం చేరుకుంటారు. ఫారెస్ట్‌ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ భక్తులు.. పకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే తాజాగా నల్లమల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. నిర్దేశించిన ప్రాంతాల్లో.. కేవలం రోడ్లపైనే ప్రయాణించాలని రాష్ట్ర అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫారెస్ట్‌లోని కాలి బాటల్లో ప్రయాణం చేయవద్దని తెలిపింది. అయితే ప్రత్యేకంగా విరామం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మాత్రం సేద తీరేందుకు అనుమతి ఇచ్చారు. విరామ ప్రాంతాల్లోనే పలు సౌకర్యాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

అడవిలో నిప్పు పెట్టడం, వంటలు వండుకోవడాన్ని, బీడీ, సిగరేట్‌ కాల్చకూడదని ఫారెస్ట్‌ అధికారులు నిషేధించారు. ఇటీవల నల్లమల అటవీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో రెండు సార్లు మంటలు చెలరేగం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే మరోసారి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర అటవీశాఖ ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి అనుకోని ప్రమాదాలకు కారణం అయితే వారిపై ఫారెస్ట్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే విధించిన షరతులను అందరూ పాటించి.. అడవుల సంరక్షణకు సహకరించాలని భక్తులను రాష్ట్ర అటవీశాఖ కోరింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవుల్లో ప్రయాణించే సమయంలో కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. కవ్వాల్‌, అమ్రాబాద్‌ ఫారెస్ట్‌లతో పాటు పలు ఫారెస్ట్‌ల్లో ఫారెస్ట్‌ అధికారులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తారు. ప్రమాదాల నివారణకు ఫారెస్ట్‌ రోడ్డులో అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు పొడవునా సూచిక బోర్డులు, హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసే ప్రమాదాలను నివారించవచ్చు. హైదరాబాద్‌-శ్రీశైలం హైవేపై రోజు వందలాది వాహనాలు వెళ్తుంటాయి.

Next Story