నేడు కేసీఆర్ సమావేశంలో చర్చించే కీలక అంశాలు ఇవే..!
By సుభాష్ Published on 27 May 2020 3:06 AM GMTఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇతర జిల్లాల్లో కాకుండా ఒక్క హైదరాబాద్‌లోనే పాజిటివ్ కేసులు నమోదు కావడంపై నగర వాసులకు మరింత ఆందోళన మొదలైంది. మంగళవాం ఒక్క రోజు తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణ లో విధించిన లాక్‌డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో పెరుగుతున్న కేసులు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలతోపాటు పలు కీలక అంశాలు కేసీఆర్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇక లాక్‌డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి. పరిమితి సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. అంతేకాదు తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు కూడా అవకాశం ఇచ్చారు కేసీఆర్.
చర్చకు వచ్చే కీలక అంశాలు ఇవే..
► జీహెచ్‌ఎంసీ పరిధిలో షాపులు ప్రతి రోజు తెరిచేందుకు అనుమతి ఇవ్వలని ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తుండటంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
► మాల్స్, దుకాణాలు, హోటళ్లు, దేవాలయాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
► హైదరాబాద్‌లో సిటీ బస్సులు, మెట్రోరైళ్లను నడిపే విషయంలో ప్రభుత్వం చర్చించనుంది.
► ఇక టెన్త్ పరీక్షల నిర్వహణ, ఇంటర్ ఫలితాలపై వెల్లడిపై చర్చ కొనసాగనుంది.
► ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కేసీఆర్ సర్కార్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
► అలాగే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించాలా వద్ద అనే అంశం చర్చించనున్నారు
వీటీపై ఈ రోజు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రానుంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని సిటీ బస్సులు నడుస్తున్నాయి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో రవాణా సౌకర్యం లేక ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తడంతో వారు కేసీఆర్‌ను కలిసి బస్సులను నడపాలని విన్నవించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.