మాస్క్ తీసేసి ఫోటోలకు ఫోజులిచ్చిన 'ట్రంప్'
By సుభాష్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం మిలటరీ ఆస్పత్రిలో చేరిన ట్రంప్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వాల్టర్ రీడ్ మెడికల్ ఆస్పత్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్ హౌస్‌కు చేరుకున్న ట్రంప్.. ఎగ్జిక్యూటివ్ మాన్షన్‌లో అభివాదం చేస్తూ తాను బాగానే ఉన్నాను అంటూ సైగలు చేస్తూ సంకేతాలిచ్చారు. అనంతరం మాస్క్ తొలగించి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే డిశ్చార్జ్ కావడానికి ముందు అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి బయటకువచ్చిన ట్రంప్. కారులో తిరిగారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌కు చికితస అందించిన ఆస్పత్రి వైద్యులుతో పాటు ప్రతిపక్ష డెమోక్రాట్లు ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. అయితే తన కోసం ప్రార్థించే అభిమానుల్లో ఉత్తేజం నింపేందుకే తాను ఇలా బయటకు వచ్చినట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
ఇక గురువారం సాయంత్రం ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మెరుగైన వైద్యం కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించగా, సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మరింత మెరుగు పడిందని, తదుపరి చికిత్స వైట్ హౌస్‌లో కొనసాగించవచ్చని వైద్యులు చెప్పారని శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి.
కాగా, నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్ల ఎలాగైన విజయం సాధించడమే లక్ష్యంగా, అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు.