గుజరాత్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకున్నారు. అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీకి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ స్వాగతం పలికారు. కాగా మరి కాసేపట్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్‌ కుష్నర్‌తో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం అహ్మదాబాద్‌ చేరుకోనుంది. వీరికి ప్రధాని మోదీ ఘన స్వాగతం పలకనున్నారు.
అహ్మదాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ట్రంప్‌ రాకకోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మోతేరా స్టేడియానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు వ్యాపారవర్గాలు కదిలి వచ్చాయి.
భారత్‌లో ట్రంప్‌ పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌ నగరాలను అధికారులు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్‌ ప్రయాణించే మార్గాల్లో సైన్యం, పారమిలిటరీ దళాలతో తనిఖీలు చేపట్టారు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు, స్నైపర్లు,స్వాట్‌ బృందాలను మోహరించాయి. అహ్మదాబాద్‌లో 10 వేల మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆగ్రాలో 3 వేల మంది బలగాలతో భారీ బందోబస్తు చేశారు.
మధ్యాహ్నం 1.05 గంటలకు మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో ట్రంప్‌, మోదీ పాల్గొంటారు. అనంతరం 3.30 గంటలకు ట్రంప్‌ ఆగ్రాకు పయనం అవుతారు. సాయంత్రం 4.45 గంటలకు ఆగ్రాకు చేరుకుంటారు. 5.15 గంటలకు భార్య మెలానియాతో కలిసి ట్రంప్‌ తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అనంతరం 6.45కు ట్రంప్‌ ఢిల్లీకి పయనమవుతారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.