'అమెరికా షట్‌డౌన్.. అలాంటి ఆలోచనేలేదు'
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 13వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 3లక్షల మంది దీని బాధితులు ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 43,700 మందికి కరోనా వైరస్(కొవిడ్-19) సోకగా.. 550 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్‌లోనే 157 మంది చనిపోయారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అమెరికా మొత్తాన్ని షట్‌డౌన్ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. కాగా.. దీనికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలా చేసే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'మరిచిపోవద్దు ఈ విషయాన్ని వైద్యులకే వదిలేస్తే దేశం మొత్తం షట్‌డౌన్ చేయమంటారు. అలాగైతే ప్రపంచమంతా షట్‌డౌన్ చేయాలి. షట్‌డౌన్ చేస్తే బాగానే ఉంటుంది. అయితే దానిని రెండేళ్లు కొనసాగిద్దామా..! అది కుదరదని మీకు తెలుసు. ఏ దేశంలోనూ ఆపని చేయరు. ప్రత్యేకించి నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థలో అస్సలు కుదరదని' ట్రంప్ అన్నారు.
అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ‘కరోనా’ వ్యాపించలేదని, కొన్ని చోట్ల మాత్రమే నామమాత్రంగా ఉందని, కాకపోతే, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఇల్లినాయిస్ లో క్వారంటైన్ చేద్దామని చెప్పారు. ఈ రెండు వారాల్లో కొంత మేరకు మెరుగయ్యామని, అయితే, ఈ సమస్య ఇప్పటికిప్పుడే తగ్గిపోతుందని మాత్రం చెప్పనని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ‘కరోనా’ మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు.షట్ డౌన్ చేయడం వల్ల అసలు సమస్య కన్నా ఇతర సమస్యలు పెరుగుతాయన్నారు. అయితే ఈ పోరాట సమయంలో మనమెన్నో విషయాలు నేర్చుకుంటాం. భవిషత్తులో ఇది మనకు ఉపయోగపడుతుందన్నారు.