500 మంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు : ఎంపీ ధర్మపురి అరవింద్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2020 12:36 PM GMT
500 మంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు : ఎంపీ ధర్మపురి అరవింద్‌

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) రోజు రోజుకు విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పాఠశాలలు, థియేటర్లు, పార్కులను మార్చి 31 వరకు మూసివేశారు. జనాలు ఎక్కువగా గుమికూడవద్దని ముఖ్య కేసీఆర్‌ స్వయంగా పిలుపునిచ్చారు. కాగా.. సీఎం ఇచ్చిన పిలుపును సొంత పార్టీ నేతలే పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు నేతలు వందలాది మంది స్థానిక ప్రజా ప్రతినిధులకు ఓ రిసార్టులో మందు పార్టీ ఇచ్చినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యవహారం టీఆర్‌ఎస్ పార్టీని విమర్శల పాలు చేస్తుండగా.. తాజాగా ఈ మందు పార్టీ అంశం మరో తలనొప్పిగా మారింది.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ నేతలు కవితక్కను టార్గెట్ చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలతో పాటు పెళ్లిళ్లను కూడా రద్దు చేస్తుండగా.. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఏం చేస్తున్నారో చూడండి’ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు. ఎన్నికల కోసం 500 మందిని, వారి కుటుంబాలను రిస్క్‌లో పెట్టారని విమర్శించారు.



Next Story