టిక్కెట్ రాలేదని.. టీఆర్‌ఎస్ నేతల 'ఆత్మహత్యాయత్నం'
By Newsmeter.Network Published on 14 Jan 2020 9:37 AM GMT
టీఆర్ఎస్ బీ ఫారం ఇవ్వలేదని కలత చెందిన ఓ నేత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సూర్యాపేట పట్టణంలోని 39వవార్డు నుంచి టిక్కెట్ ఆశించిన అబ్ధుల్ రహీం భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజుల నుంచి ప్రచారం సైతం చేపట్టారు. కాగా అదే వార్డు నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణి కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టిక్కెట్ ఖరారు కాకముందే ఇరువురు అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేస్తుండడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం ప్రకటించిన జాబితాలో సుధారాణికి టిక్కెట్ ఖరారు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. సమయానికి స్థానికులు గమనించి ఆయనను కాపాడారు.
మేడ్చల్ లో..
మేడ్చల్‌లో 14వ వార్డుకు విజయ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త నామినేషన్ దాఖలు చేశాడు. తనకు పార్టీ టికెట్ ఇస్తుందని బాగా నమ్మకం పెట్టుకున్నాడు. బీ ఫారం ఇవ్వకపోయేసరికి కలత చెందిన విజయ్ మంగళవారం మేడ్చల్‌లోని అంబేడ్కర్ జంక్షన్ వద్దకు చేరుకొని ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. నిప్పంటించుకొనేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని అతనిపై నీళ్లు పోశారు. తర్వాత ఇతర టీఆర్ఎన్ నేతలు కలిసి అతనికి నచ్చజెప్పారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీ ఫారాలు రాని ఆశావహులు రెబల్స్‌గా మారితే వారిని సముదాయించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులదేనని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.