‘అల వైకుంఠపురములో’.. త్రివిక్రమ్ కొత్త స్పీచ్ !

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Jan 2020 12:28 PM GMT
‘అల వైకుంఠపురములో’.. త్రివిక్రమ్ కొత్త స్పీచ్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులందరికీ ఈ సినిమా బాగా నచ్చడంతో సంక్రాంతి విన్నర్ అనే బిరుదు కూడా రిలీజ్ రోజే దక్కించుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ "ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. 'సిత్తరాల సిరపడు' అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రాం-లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు. అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఒక కొత్త ప్రయోగాన్ని నేను అనుకున్న దానికన్నా అందంగా తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం. దాన్ని విజయకుమార్ రాస్తే, తమన్ మంచి ట్యూన్స్ కట్టాడు.

అలాగే 'రాములో రాములా' పాటలో బ్రహ్మానందం గారిని ఉపయోగించుకున్నాం. మా మీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. ఆయన సినిమాలో ఉన్న విషయాన్ని దాచిపెట్టడం చాలా కష్టమైంది. మొత్తానికి ఏనుగుకు విడుదల కలిగించాం. సునీల్ శక్తి సునీల్‌కు తెలీదు. మేం రూంలో కలిసున్నప్పుడు వాడు విలన్ అవుదామనుకున్నాడు. నేనేమో తెలుగు ఇండస్ట్రీలోని కామెడీ దిగ్గజాల్లో నువ్వూ ఒక దిగ్గజంగా నిలిచిపోతావని చెప్పా.

హర్షవర్ధన్, నేనూ రచయితలుగా జర్నీ మొదలుపెట్టాం. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లోటు ఉంది. దాన్ని ఆయన పూడుస్తారనేది నా నమ్మకం. 'జులాయి' నుంచి నేను రాజేంద్రప్రసాద్‌తో పడుతూనే ఉన్నాను. ఇంకా ఆయన్ని భరిస్తూనే ఉంటాను. వజ్రం కఠినంగా ఉంటుంది. అలా అని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా? రాజేంద్రప్రసాద్ కూడా అంతే. ఈ సినిమా హిట్టనే ఫీలింగ్‌ని క్రియేట్ చేసిన తొలి వ్యక్తి తమన్. మా అందరి పనినీ సగం తగ్గించేశాడు. మిగతావాళ్లు తనకు మ్యాచ్ చేస్తే చాలన్నట్లు చేశాడు.

చినబాబు, అల్లు అరవింద్ ల కుటుంబ సభ్యుడ్ని నేను. మీరు కలగనండి.. మేము రియల్ చేస్తామన్నారు వాళ్లు. ఈ సినిమాకు మొదలు, చివర బన్నీనే. ఇద్దరం బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ తాగుతూ 'అల వైకుంఠపురములో' జర్నీ మొదలుపెట్టాం. అప్పట్నుంచీ మా ఇద్దరికీ ఇదే ప్రపంచం. ఎంతో తపన ఉన్న నటుడు. బన్నీ మంచి డాన్సర్ అనే విషయం అందరికీ తెలుసు. చాలా అసాధరాణ స్టైల్ సెన్స్ ఉన్నవాడు. ఈ విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప నటుడు. ఇది నాకు తెలుసు, ఇంకా కొంతమందికి తెలుసు. అతనిలోని నటన అక్కడక్కడ గ్లింప్సెస్ మాదిరిగా ఇదివరకు కనిపించింది. మొదట్నించీ చివరి దాకా అతనిలోని నటుడు కనిపిస్తే ఎలా ఉంటుంది.. అనే నా కోరిక ఈ సినిమాతో తీరింది.

బంటు అనే క్యారెక్టర్‌ను ముందుపెట్టి, తను వెనకాల ఉండటం మామూలు ప్రయోగం కాదు. ప్రతి షాట్‌కూ అతనెంత కష్టపడ్డాడో లొకేషన్లొ ఉన్న మాకు తెలుసు. దాన్ని ఈరోజు మీరందరూ గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూడగానే ఒన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ అని అతనికి చెప్పాను. మునుముందు అతను ఇంకా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇస్తాడు. సచిన్‌కు ఫుల్ టాస్ వేస్తె ఏం జరుగుతుందో, ఈ సినిమా బన్నీకి అంతే అని అన్నారు.

Next Story