తిరుమలగిరిలో పులులే పులులు..
By అంజి Published on 23 Jan 2020 9:13 PM ISTతిరుమలగిరి సెంటర్ .... అత్యంత బిజీ సెంటర్. రోజు రోజంతా ట్రాఫిక్ జామ్.... ఎర్ర సిగ్నల్ దగ్గర ఎంతో సమయం ఎదురు చూపులు... ఇసుకేస్తే రాలనంత జనం. కార్లు, స్కూటర్లు, బస్సులు, లారీలు... మధ్య మధ్యలో కుయ్ కుయ్ కుయ్ కుయ్ అనే యాంబులెన్స్ లు....
కానీ ఒకప్పుడు ఇదే చోట పులులు, చిరుతలు తిరగేవి. ఏనుగులు ఘీంకరించేవి. నెమళ్లు క్రీంకరించేవని చెబితే నమ్మగలమా? నమ్మలేము కానీ ఇదే నిజం. బ్రిటిషర్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కింగుల్లా ఉన్న సమయంలో అడవికి రాజులు కూడా ఇష్టారాజయంగా తిరిగేవి. 1926 లో ప్రచురితమైన ఒక కథనంలో అప్పడి రాయల్ ఆర్మీ మెడికల్ కోర్స్ క్యాప్టెన్ ఎస్ స్మిత్ తిరుమలగిరి బెబ్బులుల రాజ్యమని వ్రాశారు. అంతే కాదు. బొల్లారంలో ఒక పులిని హతమార్చినట్టు కూడా వ్రాశారు. సీజన్ వస్తే చిరుతలు, పాంథర్లు భారీ సంఖ్యలో ఉండేవని, స్థానికుల సాయంతో గుర్రం మీద ఎక్కి వాటిని వేటాడేవారమని కూడా ఆయన వ్రాశారు. ఒక మేకను ఎరగా పెట్టి, చెట్ల మీద మంచెలు కట్టుకుని పులుల కోసం ఎదురుచూసేవారమని ఆయన వ్రాసుకున్నారు.
1926 కాదు. 1876 నాటికే కోల్ కతా రివ్యూ పత్రికలో నిజాం రాజ్యంలో పులుల వేట అన్న వ్యాసం ప్రచురితం అయింది. ఓల్డ్ కంటోన్మెంట్ లో, దాని పక్కనే ఉన్న తిరుమలగిరి లో పులలను వేటాడామని, పులులను చంపిన వారికి భారీ బహుమానాలు ఉండేవని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. వెన్నెల రాత్రిలో, కుంటల దగ్గర మాటువేసి పులులను ఒక్క తూటాతో చంపేసేవారమని, పులి మృతదేహాన్ని ఎడ్లబండిలో వేసుకుని తెచ్చేవారమని ఆ రచనలో చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ లో ఉన్న అతి పురాతన ఆల్ సెయింట్స్ చర్చిలో గోడ మీద ఒక లోహఫలకం ఉంది. దానిపై రాయల్ హార్స్ ఆర్టిలరీలోని ఎల్ బ్యాటరీలో క్యాప్టెన్ గా ఉన్న జోసెలిన్ మెల్లర్ 1905, జూన్ 6 న పులి చేసిన దాడిలో గాయపడి చనిపోయాడని వ్రాసి ఉంది.
ఈ రోజు తిరుమలగిరి సెంటర్లో మీ వాహనాలు రయ్యి రయ్యి మంటూ ఉండవచ్చు. కానీ ఒకప్పుడు పులుల పాదముద్రలు, చిరుతల అడుగులు అదే చోట పడి ఉంటాయన్న సంగతి గుర్తుంచుకొండి. ఈ రోజు తారు రోడ్లు ఒకప్పటి కాలి బాటలని, అటూ ఇటూ దట్టమైన అడవి ఉండేదని, ఆ అడవిలోనే వనరాజులు, గజరాజులు సంచరించేవని గుర్తుకు తెచ్చుకొండి. ఒళ్లు ఒక్కసారి జలదరిస్తుంది. ఆ రోజుల్లోకి వెళ్లిపోతారు... అంతలోనే వెనకనుంచి ఏదో వాహనం హారన్ మోగుతుంది. మీరు మళ్లీ అడవి బాట నుంచి తారు రోడ్డు మీదకు వచ్చేస్తారు.