స్థానిక ఎన్నికల పిటిషన్‌పై నేడు విచారణ

By అంజి
Published on : 18 March 2020 8:40 AM IST

స్థానిక ఎన్నికల పిటిషన్‌పై నేడు విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సీఎం జగన్‌ సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న కేసులో జాబితాలో.. ఇది ఏడో కేసుగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికలు వాయిదా వేయాలని గతంలో కిషన్‌ సింగ్‌ తోమర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయాన్ని ప్రభుత్వం తమ పిటిషన్‌లో పేర్కొంది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహన పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ ఈ నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని, ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడడం రాజకీయ రగడకు దారి తీసింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Next Story