అప్పుడు దాత... ఇప్పుడు సీబిఐ దాడుల మోత

By Newsmeter.Network  Published on  2 Jan 2020 6:32 AM GMT
అప్పుడు దాత... ఇప్పుడు సీబిఐ దాడుల మోత

ఆయన ఎప్పుడూ వార్తల్లో వ్యక్తే. తిరుచానూరు పద్మావతమ్మకి 4.33 కోట్ల విలువైన బంగారు చీరను ఆయన కానుకగా ఇచ్చారు. ఆ చీరలో వజ్రాలు, పగడాలు పొదిగారు. ఇది 2012 నవంబర్ మాట. ఆ తరువాత ఆయన ఏడాది తిరక్కుండానే 2013 డిసెంబర్ లో తిరుమల నిత్యాన్నదాన ట్రస్టుకు 3.42 కోట్లు ఇచ్చారు. దాంతో ఆయన పేరు పత్రికల్లో మార్మోగిపోయింది. కానీ అదే వ్యక్తి ఇంటి మీద ఇప్పుడు సీబీఐ దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నలు, సవాళ్లు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆయనే చెరుకూరి శ్రీధర్. చెరుకూరి శ్రీధర్ ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్.

ట్రాన్స్ ట్రాయ్ అంటే ఏదో మామూలు కంపెనీ అనుకునేరు. అది చాలా పెద్ద నిర్మాణ రంగ సంస్థ. నిన్న మొన్నటి దాకా పోలవరం ప్రాజెక్టు పనులు చూసిన సంస్థ. వారానికొక సారి చంద్రబాబు నాయుడంతటి వాడు వెళ్లి మరీ పర్యవేక్షించిన పని అది. అంతే కాదు. ఆ సంస్థ యజమాని రాయపాటి సాంబశివరావు. ఆయన తెలుగుదేశం ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు చెరుకూరి శ్రీధర్ తో పాటు రాయపాటి సాంబశివరావు ఇంటిపైన, ఆఫీసుల పైన కూడా సీబీఐ దాడులు జరుగుతున్నాయి.

అందనంత ఎత్తైన అప్పుల మేడ కట్టింది

ట్రాన్స్ ట్రాయి పోలవరం కట్టిందో లేదో తెలియదు కానీ అందనంత ఎత్తైన అప్పుల మేడ కట్టింది. వివిధ బ్యాంకుల నుంచి రూ. 264 కోట్ల మేరకు ఋణాలు తీసుకుని ఎగేసింది. ఒక పని పేరు మీద ఋణం తీసుకుని ఇంకో పని కోసం ఖర్చు చేసింది. రెండేసి వేర్వేరు ఖాతాలు మెయింటెయిన్ చేసి బ్యాంకులనే మోసగించింది. . ఒకటి కాదు ... రెండు కాదు.. పధ్నాలుగు బ్యాంకుల నుంచి ఋణాలను పొందింది. ఇరిగేషన్, రోడ్లు, మెట్రో, మెట్రో అండ్‌ రైల్వేస్, ఆయిల్‌ గ్యాస్‌ల ప్రాజెక్టులు తాము చేపడతామని చెప్పి ఈ ఋణాలను పొందింది. పోలవరం హెడ్‌ రెగ్యులేటరీ వర్క్స్‌ పనులతోపాటు, ఇతర అభివృద్ధి పనులు చూపి 14 బ్యాంకుల కన్సార్షియం వద్ద వివిధ దశల్లో రూ.8,800 వరకు రుణాలు పొందింది.

ట్రాన్స్ ట్రాయ్ అసలే పనీ చేయలేదని కాదు. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో కుమరంభీమ్‌ ప్రాజెక్టు, అనంతపురంలోని చాగల్లు బ్యారేజ్‌లను పూర్తి చేసింది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌రోడ్‌ ఫేస్‌–1 పనులను, మధ్యప్రదేశ్‌లో రెండు భారీ, తమిళనాడులో ఓ భారీ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసింది.

అయితే తీసుకున్న ఋణాలను చెల్లించే విషయంలో కంపెనీ విపరీతమైన జాప్యం చేసింది. 2015 నుంచే రికవరీకి ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మే, 2015 లో దీనిని నిరర్థక ఖాతాగా ప్రకటించారు. చివరికి 2018 లోనే నేషనల్‌ కంపనీస్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను కెనరాబ్యాంకు ఆశ్రయించింది. తాజా గా తమ నుంచి తీసుకున్న రుణాల్లో రూ.264 కోట్లను వేరే ఖాతాలకు మళ్లించారన్న యూనియన్‌బ్యాంకు ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇప్పుడు తాజా దాడులతో అటు రాయపాటి, ఇటు చెరుకూరి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సీబీఐ వీరి సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తోంది.

Next Story