వారిద్ద‌రి మ్యారేజ్ సర్టిఫికేట్‌కు రెండేళ్లు ప‌ట్టింది.. ఎందుకంటే..

By Newsmeter.Network  Published on  15 Feb 2020 10:06 AM GMT
వారిద్ద‌రి మ్యారేజ్ సర్టిఫికేట్‌కు రెండేళ్లు ప‌ట్టింది.. ఎందుకంటే..

వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ కోసం రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లారు. వారికి మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడానికి రెండు సంవత్సరాలు పట్టింది. అదేంటి.. మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ వారం రోజుల్లో ఇచ్చేస్తారూ గదా.. మహా అయితే ఓ నెలరోజులు పట్టొచ్చు.. అంతేకాని రెండు సంవత్సరాలు ఎందుకు పట్టిందనేగా మీ డౌట్.. అయితే ఇది చదవండి.

మణిగంధన్‌, సురేఖ(ట్రాన్స్ జెండర్‌). వారిద్దరి మనసులు కలిసాయి. ప్రేమించుకున్నారు. వారిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ తెచ్చుకుందాం అని కోయంబత్తూరు రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లారు. అక్కడే వారికి షాక్‌ తగిలింది. ఓ అబ్బాయి-అమ్మాయి పెళ్లి అయితే సర్టిఫికేట్‌ ఇవ్వగలం గానీ.. మీకు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదన్నారు అక్కడి అధికారులు. మాకు అదంతా తెలీదు.. మాకు సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు ఈ దంపతులు. ఏ సెక్షన్‌ ప్రకారం వీరికి సర్టిఫికేట్‌ ఇవ్వాలో తెలీక తలలు పట్టుకున్నారు అధికారులు. చేసేదేం లేక వెనుదిగారు ఈ దంపతులు.

సర్టిఫికేట్‌ కోసం.. చెన్నై వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ని కలిశారు. ‘అవకాశం ఉందేమో చూస్తాను’ అని ఆయన చెప్పి పంపించారు. వాళ్లు వెళ్లిన తరువాత ఆయన సిబ్బంది చేత నిబంధన పుస్తకాలు తెప్పించుకున్నారు. 2009 తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మ్యారేజస్‌ యాక్ట్‌లో సన్నటి దారం లాంటి ఆధారం దొరికింది. దాన్ని పట్టుకుని ఈ ఏడాది జనవరి 28న అన్ని జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు నోటిఫికేషన్‌ పంపించారు. ట్రాన్స్‌జెండర్‌ పెళ్లిళ్లను చట్టబద్దం చేసే ఉత్తర్వు అది. ఆ ఉత్తర్వు కోయంబత్తూరు కూడా చేరింది. అక్కడి అధికారులు వెంటనే మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ మణిగంధన్‌కి వర్తమానం పంపారు. తమ ప్రేమకు గుర్తుగా ఫిబ్రవరి 14న వచ్చి తీసుకుంటాం అని చెప్పారు ఆ దంపతులు. నిన్న వాలంటైన్స్‌ డే రోజున వెళ్లి రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లి సంతకం పెట్టి.. సర్టిఫికేట్‌ తెచ్చుకున్నారు. అసలు విశేషం ఏంటంటే.. సరిగ్గా రెండేళ్ల క్రితం వాలంటైన్స్‌ రోజునే వాళ్ల పెళ్లి జరిగింది.

మొత్తానికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఈ ఆలూమగల చేతికి వచ్చింది. అయినా సర్టిఫికెట్‌ కోసం ఎందుకు ఇంతగా వీళ్లు తిరిగారు అంటే..? ‘‘బిడ్డను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఉండాలన్నారు. ఇప్పుడు ఉంది. త్వరలో మేము అమ్మానాన్న కాబోతున్నాం’’ అన్నారు మణిగంధన్, సురేఖ.. దంపతులు చిరునవ్వులు చిందిస్తూ.

Next Story