కరోనా కల్లోలానికి భారత్ సహా ప్రపంచ దేశాలు అతలాకుతమవుతున్నాయి. వలస కూలీలు, కార్మికుల కు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు సైతం పేదలకు నిత్యావసరాలు అందిస్తూ..భోజన వసతిని కల్పిస్తున్నా ఇంకా ఏదోమూల ఎందరోకొందరు ఆకలితోనే పడుకుంటున్నారు. బహుశా ఆకలి చావులు కూడా ఉండి ఉండొచ్చు కానీ..కరోనా కష్టం ముందు అలాంటివి బయటికి రావట్లేదు.

కనిపించిన పేదలకు, అన్నార్తులకు అన్నం పెట్టి కడుపు నింపుతున్నారు కానీ..మాకెవరు అన్నం పెట్టి ఆకలి తీరుస్తారంటున్నారు ట్రాన్స్ జెండర్లు. పలానా ప్రాంతంలో ఆహారం పెడుతున్నారు..లేదా నిత్యావసరాలు ఇస్తున్నారంటే వెళ్లి తెచ్చుకోవడానికి పోలీసుల భయం వెంటాడుతోందని వాపోతున్నారు. తాము బయటికెళ్తే వృత్తి కోసమే వెళ్లామని భావించి తమపై కేసులు పెడతారన్న భయంతో బయటికి వెళ్లలేక ఇప్పటి వరకూ తమ వద్దనున్న డబ్బుతోనే ఎలాగొలా నెట్టుకొచ్చామన్నారు. ఇప్పుడు తామంతా ఓ గ్రూప్ గా ఏర్పడి తలాకొంత జమచేసుకోగా ఉన్న నగదుతోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఇప్పుడు బిజినెస్ చేయలేం. దాతలిచ్చే సహాయం పొందాలన్నా బయటికి వెళ్లలేం. ఆఖరికి అన్నపూర్ణ సెంటర్లలో పెట్టే భోజనాన్ని తినేందుకు కూడా వెళ్లలేని దీన స్థితిలో ఉన్నారు ట్రాన్స్ జెండర్లు.

తమ ఇబ్బందులను గ్రహించి, తాము కూడా మనుషులమేనని గుర్తించి ఆకలి తీర్చాలని వేడుకుంటున్నారు. లాక్ డౌన్ రోజులను మరింత పొడిగిస్తే వృత్తిని అనుసరించలేం. ప్రభుత్వం ఆదుకోకపోతే తమలో ఆకలి చావులు తప్పవంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, ఆహారం అందక చాలా ఇబ్బందులు పడుతున్నాం..ఆదుకోండంటూ మొరపెట్టుకుంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.