పాక్‌లో ఘోర రైలు ప్రమాదం.. 70 మందికి పైగా మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 5:42 AM GMT
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం.. 70 మందికి పైగా మృతి..!

గ్యాస్.. చిచ్చు పెట్టింది. వంట... మంటలు రేపింది. పదుల మందిని బలి తీసుకుంది. డజన్ల మందిని ఆస్పత్రుల పాల్జేసింది. ప్రజల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలగలసి ఎన్నో కుటుంబాలకు తీరాని శోకం మిగిల్చాయి.

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తేజ్‌గమ్‌ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. తేజ్‌గమ్ రైలు కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తోంది. ట్రైన్, లియాకత్పూర్‌ నగరం సమీపానికి రాగానే అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి వేగంగా ఇతర బోగీలకు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకొని పదులమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రయాణికులలో కొందరు అల్పాహారం కోసం గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ వెలిగించడం వల్లే ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం టిఫిన్‌ తయారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెండు స్టవ్‌లు పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. వంట కోసం సిద్ధంగా ఉంచుకున్న నూనెకు మంటలు అంటుకోవడంతో పరిస్థితి బీభత్సంగా మారిపోయింది. క్షణాల్లో మంటలు మూడు బోగీలను చుట్టుముట్టాయి. దాంతో బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు...వేగంగా వెళ్తున్న ట్రైన్‌ నుంచి బయటికి దూకేశారు. చనిపోయిన వారిలో ట్రైన్ నుంచి బయటికి దూకేసిన వారే ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు.

రైళ్లలో గ్యాస్ సిలిండర్లను అనుమతించరు. అది చాలా ప్రమాదకరం కూడా. ఐతే, అధికారులకు తెలీకుండా కొంద రు ప్రయాణికులు, దుస్తుల్లో గ్యాస్ స్టవ్‌లు దాచి ట్రైన్లోకి తెచ్చినట్లు సమాచారం. ఆ తప్పే ఇప్పుడు పెను ముప్పుగా మారి పదుల మందిని బలి తీసుకుంది. వంట చేస్తున్న క్రమంలో మంటలు అంటుకుని పలువురి ప్రాణాలను తీసింది. ఇక, సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. సైన్యం కూడా రంగంలోకి దిగింది. సైనిక బలగాలు, వైద్యులు, పారామెడికల్స్ సత్వరమే స్పందించి బాధితులను ఆదుకున్నారు. ఇక, ఈ ప్రమాదంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ​కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Img 20191031 102240

Next Story