మహబూబాబాద్‌లో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
By తోట వంశీ కుమార్ Published on 5 July 2020 4:43 AM GMTమహబూబాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. శనిగాపురం బోధ్ తండాకు చెందిన నలుగురు చిన్నారులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి బోడతండాలోని తుమ్మల చెరువుకు వరద కాలువల ద్వారా నీరుచెరింది. దీంతో తండాకు చెందిన లోకేష్ (11), రాజేష్ (8), జగన్ (8), దినేష్ (9) లు ఈతకొట్టేందుకు శనివారం తుమ్మల చెరువుకు వెళ్లారు.
చెరువులో మిషన్ కాకతీయ కార్యక్రమంలో తీసిన లోతైన నీటి గుంతల్లో పడి ఆ నలుగురు చిన్నారులూ మృతిచెందారు. మృతి చెందిన చిన్నారుల్లో లోకేష్, రాజేష్‌లు సొంత అన్నదమ్ములు కాగా.. మరో ఇద్దరు సమీప బంధువులు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలఫిస్తున్నారు. విషయం తెలుసుకున్న మానుకోట డీఎస్పీ ఆంగోత్ నరేష్ కుమార్, రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, ఎస్సై రమే్‌షబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.