మహా నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్

By రాణి  Published on  30 Jan 2020 9:06 AM GMT
మహా నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్

ముఖ్యాంశాలు

  • రోడ్ల మీద జరిగే ఆందోళనలు, ప్రదర్శనలే ప్రధాన కారణం
  • టోల్ గేట్ల దగ్గర తక్కువ నిడివి రోడ్డుపై ఎక్కువ టోల్ వే లు
  • ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అధికం
  • టోల్ గేట్ల దగ్గర సర్వీస్ రోడ్లను నిర్మించడమే పరిష్కారం
  • పట్టించుకోని నేషనల్ హైవే అథారిటీ, ప్రయాణికులకు తిప్పలు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఢిల్లీ చండీఘడ్ హైవేలో ఉన్న ముర్తల్ ప్లాజా దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. రెండు రోజులుగా ఈ దారిలో విపరీతమైన ట్రాఫిక్ జామ్. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడం, అంగుళం అంగుళం ముందుకు కదలడం దీనికి కారణం. ఆగ మేఘాలమీద తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించారు. ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషించి వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా ఈ మార్గంలో సాఫీగా వాహనాలు వెళ్లిపోయే పరిస్థితిని కల్పిస్తామని చెబుతున్నారు. టోల్ గేట్ల దగ్గర వాహనాలను నిలుపుకోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం, రోడ్లు చాలా ఇరుకుగా ఉండడమే జాతీయ రహదారుల మీద ట్రాఫిక్ జామ్ లకు కారణం అన్న విషయాన్ని అధికారులు ఒప్పుకుంటున్నారు. ఈ మార్గంలో ఉన్న టోల్ గేట్ దగ్గర 60 మీటర్ల వెడల్పున్న రోడ్డు మీద 20 టోల్ లైన్స్ ని ఏర్పాటు చేయడమే ట్రాఫిక్ జామ్ కి అసలు కారణం అన్న విషయాన్ని అధికారులు ఒప్పుకుని తీరాల్సిందే.

సక్రమంగా టోల్ వసూలు చేయడం కోసం ఇలా టోల్ లైన్లను ఇబ్బడి ముబ్బడిగా పేంచేశారు. వాటివల్ల టోల్ ఆదాయం పెరిగింది. దానితోపాటు ట్రాఫిక్ సమస్యలు, జామ్ లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కసారి జాతీయ రహదారి మీద ట్రాఫిక్ జామ్ అయితే కేవలం పదినిమిషాల్లో దాదాపు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గంటలు గడిచిన కొద్దీ ఈ రద్దీ దాదాపుగా వంద కిలోమీటర్లకు పైగా పెరిగినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు టోల్ గేట్లు ఉన్న ప్రాంతంలో తప్పనిసరిగా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేసి వాటిపై టోల్ లైన్లను పెడితే కొంతవరకూ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇప్పటివరకూ ఆ దిశగా చేసిన ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. తాజా పరిస్థితులు, ఆధ్యయనాల నేపధ్యంలో వీలైనంత త్వరగా తారుతో సర్వీస్ రోడ్లను నిర్మిస్తామని అధికారులు చెబుతున్నా ఆ ఆలోచన ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చెప్పలేని పరిస్థితి.

Traffic Jam In Main Cities 2

గడిచిన రెండ్రోజుల్లో 8 గంటలకు పైగా ట్రాఫిక్ లో..

పుణే నుంచి వెళ్లే వాహనదారులు ఇలా ఎక్స్ ప్రెస్ హైవేలమీద, టోల్ గేట్ల దగ్గర దాదాపుగా గడచిన రెండు రోజుల్లో ఒక్కొక్కరు ఎనిమిది గంటలకు పైగా సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చుంటుందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో అయితే కిందటి ఏడాది అక్టోబర్ 23న ప్రయాణికులు నిజంగా నరకాన్ని చవి చూశారని రిపోర్టులు చెబుతున్నాయి. రెండు వందల మందికి పైగా దివ్యాంగులు మండీ హౌస్ దగ్గర రోడ్డును బ్లాక్ చేసి చేసిన ధర్నావల్ల మొత్తం సెంట్రల్ ఢిల్లీ గ్రిడ్ లాకైపోయింది. తమకు రైల్వేలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందంటూ దివ్యాంగులు ఆందోళనకు దిగారు.

ఇంత పెద్ద ఎత్తున ఎక్కువ మందికి అసౌకర్యం కలిగితేనే గానీ, ఆ విషయం వార్తల్లోకి ఎక్కితేనేగానీ తమ సమస్య ప్రభుత్వం దృష్టికి రాదన్నది వాళ్ల స్ట్రాటజీ. అయితే అయ్యుండొచ్చుగాక. కానీ ఇలా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఆందోళనలకు దిగడం ఏంటన్నది పబ్లిక్ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లే లేరిప్పుడు. అందువల్లే ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు, ప్రయాణికులకు ఇబ్బందులు, గంటలకొద్దీ రోడ్లమీదే గడపడాలు. మళ్లీ ఇప్పుడు గడిచిన రెండు రోజుల్లో అలాంటి పరిస్థితి ఎదురయ్యింది.

Traffic Jam In Main Cities 3

సెప్టెంబర్ 9, 2019న ముంబైలో అచ్చంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆగస్ట్ 2వ తారీఖునైతే జనం అస్సలు రోడ్లమీద తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. గడిచిన పది పదిహేనేళ్లలో ముంబైలో అంత తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జామ్ ని ఎప్పుడూ చూడలేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పూణే, ముంబై ఎక్స్ ప్రెస్ హైవేలో అయితే కిలోమీటర్ల కొద్దీ వందలాది వాహనాలు వరుసగా గుద్దుకోవడం, మేజర్ యాక్సిడెంట్లు కావడం గడిచిన ఆరు నెలల్లో ఎన్నోసార్లు జరిగింది. వేగంగా వాహనాలు వెళ్తున్నప్పుడు ఒక్క వాహనానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెనకాలే ఉన్న వాహనాలన్నీ వరుసగా టపటపా యాక్సిడెంటుకు లోను కాక తప్పని పరిస్థితి ఎక్స్ ప్రెస్ హైవేల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

గతేడాది ఆగస్ట్ 20వ తేదీన బెంగళూరు రోడ్ల మీద ప్రయాణికులు, వాహనదారులు నరకాన్ని ప్రత్యక్షంగా చవిచూశారు. ఇదంతా కేవలం టోల్ గేట్ల దగ్గర టోల్ వే ల వల్ల జరిగిన ట్రాఫిక్ జామేనన్న విషయాన్ని మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. ముంబై, ఢిల్లీ, బోగోటా, జకార్తా, ఇస్తాంబుల్, మాస్కో, బ్యాంకాక్, మెక్సికో సిటీ, బుచారెస్ట్, రెసిఫే లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో కిందటి ఏడాదితో పోలిస్తే ట్రాఫిక్ జామ్ ల ఇబ్బందుల విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు ఏం కనిపించడంలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Next Story