షాక్‌ ఇచ్చిన మున్సిపల్‌ ఫలితాలు.. పీసీసీ కొత్త చీఫ్‌ ఎవరు..?

By అంజి  Published on  26 Jan 2020 5:07 AM GMT
షాక్‌ ఇచ్చిన మున్సిపల్‌ ఫలితాలు.. పీసీసీ కొత్త చీఫ్‌ ఎవరు..?

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర ఓటమి ఎదురవడంతో ఇప్పుడు మళ్లీ రాష్ట్ర కొత్త కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. పట్టణాల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత ఉందనే అంచనాతో ముందుకెళ్లిన కాంగ్రెస్‌కు పరాభవమే ఎదురైంది. 2015లో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2018లోనే పదవీకాలం పూర్తికాగా, ఆతర్వాత వరుస ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ జాతీయ నేతలు ఆయనే పదవిలో కొనసాగించారు.

తాజా పురపోరు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిరాశ ఎదురుకావడం, 20 మునిసిపాలిటీల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఈ ఎన్నికల్లో భారీ షాక్‌ తగిలింది. రేవంత్‌ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో కారు ధాటికి కాంగ్రెస్‌ తట్టుకోలేకపోయింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా, 8 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలు రేవంత్‌ రెడ్డికి ఓ రకంగా పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. కొడంగల్‌ గెలుపు బాధ్యతలు స్వయంగా రేవంత్‌ రెడ్డి భుజాన వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసినా.. ఫలితం లేకుండా పోయింది.

పీసీసీ చీఫ్‌ రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శలు చిన్నారెడ్డి, సంపత్‌ కుమార్‌లు ఉన్నారు. మున్సిపాల్‌ ఎన్నికల్లో అక్కడక్కడ బీజేపీ మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నవారి పరిధిలోని మున్సిపాలిటీల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో వారి పనితనాన్ని బట్టి పదవి కట్టబెడతామని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోందని ఓ నేత అన్నారు. ఈ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గ పరిధిలోని ఆదిభట్ల, చండూరు, తుర్కయాంజల్‌, పెద్ద అంబర్‌పేట మున్సిపాలటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. భువనగిరి, యాదగిరిగుట్టతో పాటు మరో రెండు మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాలు చక్కగా పనిచేశాయనే చెప్పాలి. ఆయన నియోజకవర్గ పరిధిలోనే కాంగ్రెస్‌ ఎక్కువ మున్సిపాలిటీలను గెల్చుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తన నియోజకవర్గంలోని మంథని మున్సిపాలిటీలో గెలవలేకపోయారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ గెలవడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గట్టిషాకే తగలింది. మున్సిపల్‌ ఫలితాలు టీపీసీసీ చీఫ్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నిరాశ కలిగించాయి. హుజూర్‌నగర్‌, కోదాడ మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్‌ నెగ్గలేకపోయింది.

Next Story
Share it