పిచ్చి పిచ్చిగా మొరగకండి..ఎన్నికలు వాయిదా వేయమని అడగలేదు : ఉత్తమ్

By రాణి  Published on  26 Dec 2019 9:15 AM GMT
పిచ్చి పిచ్చిగా మొరగకండి..ఎన్నికలు వాయిదా వేయమని అడగలేదు : ఉత్తమ్

హైదరాబాద్ : ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవని వాడు నా గురించి మాట్లాడేంత గొప్పవాడయ్యాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోయల్, కాంగ్రెస్ నాయకులతో పాటు ఆయన మాట్లాడారు. ఈసారి నుంచి రాష్ర్టంలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఈసీకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఒక్కరోజు ముందు రిజర్వేషన్లు ఇచ్చి, రెండ్రోజుల్లో నామినేషన్లు వేయమనడం పద్ధతి కాదని ఉత్తమ్ ఆరోపించారు.

తాను ఎన్నికలకు భయపడి మాట్లాడటం లేదని, రిజర్వేషన్ తెలియకుండానే ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎక్కడైనా ఓటర్ల జాబితా ఫైనల్ అవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకైనా, సార్వత్రిక ఎన్నికలకైనా షెడ్యూల్ ప్రకటిస్తారా ? అని ప్రశ్నించారు. తాము మాట్లాడేది అర్థం చేసుకోకుండా పిచ్చిగా మొరగడం మాని ఏం చెప్తున్నామో అర్థం చేసుకోవాలన్నారు. ఇటీవలే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రిజర్వేషన్ల ప్రకటనకు, నామినేషన్లు వేసేందుకు మధ్య కొద్దిగా గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామే గానీ..ఎన్నికలను వాయిదా వేయమని అడగటం లేదన్నారు ఉత్తమ్ కుమార్.

ఏఐసీసీ అధికార ప్రతినిధి

శక్తి సింగ్ గోయల్ మాట్లాడుతూ...పీఎం నరేంద్ర మోడీ ఓటు బ్యాంక్, రాజకీయాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న ఐదు దేశాల్లో భారత్ ఉండేదని శక్తి సింగ్ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం ఆర్థికంగా పతనమవుతున్న నేపధ్యంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం సీఏఏ, ఎన్ ఆర్ సీ బిల్లులను తెరమీదకు తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళనలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. అస్సాంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ (నేషనల్ రిజర్వేషన్ ఆఫ్ సిటిజన్స్) అమలుకు కేంద్రం సిద్ధమవుతుందని, ఇప్పుడు ప్రతిఘటించకపోతే భారత్ మోడీ చేతిలో కీలుబొమ్మ అవుతుందని ఆయన వాపోయారు. ప్రధాని స్థానంలో ఉన్న మోడీ తన డిగ్రీని ఎవరికీ చూపించడు కానీ..దేశంలోని ప్రజలంతా బర్త్ సర్టిఫికేట్ మాత్రం చూపించాలని ఎలా అడుగుతున్నారని శక్తిసింగ్ ప్రశ్నించారు.

గాంధీ భవన్ లో సమావేశం ప్రారంభమయినపుడే కాంగ్రెస్ నేత వీహెచ్ అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. పార్టీతో సంబంధం లేనివాళ్లని కూడా సమావేశానికి ఎందుకు పిలుస్తారంటూ ఆయన ఫైర్ అయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని వీహెచ్ బాయ్ కాట్ చేశారు.

Next Story
Share it