తొలి పూజలు చేసిన సీయం దంపతులు

By -  Nellutla Kavitha |  Published on  28 March 2022 4:46 PM IST
తొలి పూజలు చేసిన సీయం దంపతులు

ఆరేళ్ల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు దర్శనమిచ్చారు. సర్వాంగసుందరంగా ముస్తాబైన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహా క్రతువులో, తొలి పూజలు సీఎం కేసీఆర్ దంపతులు చేశారు. వెయ్యి ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న యాదాద్రి ఆలయాన్ని మరో వెయ్యేళ్ళ పాటు ఉండేలా పునర్నిర్మించారు. పునర్ నిర్మాణ అనంతరం మహా క్రతువులో భాగంగా గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు తొలి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్ దంపతులు. యజ్ఞయాగాదులలో పునీతమైన యాదాద్రి ఈరోజు నుంచి సామాన్య భక్తజనానికి అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శోభాయాత్రను ప్రారంభించి, ఆలయం చుట్టూ ఉత్సవమూర్తులను ఊరేగించారు. వేద మంత్రాల మధ్య మహాకుంభ సంప్రోక్షణ జరిపారు. ప్రధాన రాజగోపురం దగ్గర సీఎం కేసీఆర్, ఇతర గోపురాల దగ్గర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సంప్రోక్షణ చేశారు.

ఆగమం, వాస్తు శాస్త్రం, ఇంజనీరింగ్ పనితనంతో ఐదేళ్లపాటు 2,500 మంది శిల్పులు, పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు తో యాదాద్రి ని పునర్నిర్మించారు. వెయ్యేళ్ళ పాటు ఉండేలా మొత్తం కృష్ణ శిలల తోనే అష్టభుజి ప్రాకార మండపాలు, సప్త గోపురాలతో ఆ పంచ నరసింహుడి ఆలయ నిర్మాణం జరిగింది. జ్వాల, యోగ, గండభేరుండ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహుడు కొలువైన యాదాద్రి లో అణువణువు అద్భుతంగా, అడుగడుగూ ఆధ్యాత్మికత నిండేలా నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కళాదర్శకుడిని ఇందుకోసం ఎన్నుకున్నారు. చాళుక్య, చోళ, పల్లవ, విజయనగర శిల్ప కళతో పాటుగా, కాకతీయ కళా శైలి ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది కోవెల నిర్మాణం.

Next Story