వరల్డ్‌లోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం, అమెరికాలో ప్రారంభం

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  10 Oct 2023 7:33 AM GMT
world, second largest, hindu temple,  america,

 వరల్డ్‌లోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం, అమెరికాలో ప్రారంభం

హిందూ దేవాలయాలు భారత్‌లో ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో పెద్ద పెద్ద ఆలయాలతో పాటు.. పురాతన దేవాలయాలు కనిపిస్తుంటాయి. కానీ.. భారత్‌ వెలుపు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేవాలయం నిర్మితమైంది. మరెక్కడో కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో. అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో స్వామినారాయణ్‌ అక్షరధామ్‌గా పిలుచుకునే ఈ దేవాలయాన్ని మహంత్‌ స్వామి మహరాజ్‌ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఆదివారంమే ఈ ఆలయం లాంఛనంగా ప్రారంభమైంది. అయితే.. ఆలయం ప్రతిష్ఠ మహోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. అక్టోబర్ 8నే ఆలయం ప్రారంభమైనా.. దర్శనాలు మాత్రం అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ ఆలయ నిర్మాణంతో అమెరికాలోని అక్షర్‌దామ్‌ ఆలయ వాలంటీర్లు, భక్తుల కల నెరవేరినట్లు అయ్యింది. అధికారికంగా అక్టోబర్ 8న ఆలయాన్ని ప్రారంభించారు. కానీ.. 18వ తేదీ నుంచి భక్తులకు ఈ ఆలయం అందుబాటులోకి రానుంది. భారతీయ అమెరికన్లు, హిందూ అమెరికన్లకు ఇది ఒక మైలురాయి వంటిందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. 2011లో రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో అక్షరధామ ఆలయ నిర్మాణం ప్రారంభం అయ్యింది. ఈ ఆలయం 183 ఎకరాల విస్తీర్ణంలో (ఎత్తు: 42 అడుగులు, వెడల్పు: 87 అడుగులు, పొడవు: 133 అడుగులు) నిర్మాణం జరిగింది. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతున్నారు. ఆలయ నిర్మాణం 2011 నుంచి 2023 వరకు అంటే సుమారు 12ఏళ్లు కొనసాగింది. అమెరికా వ్యాప్తంగా తరలివచ్చిన 12వేలపైగా మంది ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షర్‌ధామ్‌లో చూడొచ్చు. బ్రహ్మకుండ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపారు. ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహాం లింకన్ వంటి చారిత్రక వ్యక్తుల శిల్పాలను కూడా చెక్కారు.

కాగా.. కంబోడియాలోని 12వ శతాబ్దం నాటి అంగ్‌కోర్ హట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. ఆ ఆలయం 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.దాని తరువాత బహుశా ఇదే అతిపెద్దదని హిందూ ఆలయంగా చెబుతున్నారు. ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు తరలివస్తున్నారు.

Next Story