హర్మన్ vs మంధాన.. టైటిల్ ఎవరిదో..?
Womens T20 Challenge Final Match. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్‌కు ముందు మరో ఆసక్తికర సమరానికి రంగం
By Medi Samrat Published on 9 Nov 2020 3:22 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్‌కు ముందు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. సోమవారం జరిగే మహిళల టీ20 ఛాలెంజ్ 2020 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్ జట్టు ట్రయల్‌బ్లేజర్స్‌తో తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని జట్టు వరుసగా మూడో టైటిల్‌పై కన్నేయగా.. స్మృతి మంధాన జట్టు తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోంది.
లీగ్ దశ చివర మ్యాచ్‌లో బ్లేజర్స్‌పై సూపర్‌నోవాస్ గెలువడంతో రెండు జట్లు తుదిపోరుకు చేరగా.. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో మిథాలీరాజ్ కెప్టెన్సీలోని వెలాసిటీ ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో సూపర్‌నోవాసే ఫేవరేట్. గత మ్యాచ్‌లో గెలిచిన సూపర్‌నోవాస్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. శ్రీలంక ఓపెనర్ చమరి ఆటపట్టు సూపర్ ఫామ్ సూపర్‌నోవాస్‌కు పెద్ద సానుకూలాంశం. రెండు మ్యాచ్‌ల్లో ఆమె 111 పరుగులు చేసింది. ముఖ్యంగా ట్రయల్‌బ్లేజర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్ (48 బంతుల్లో 67) ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ 31 పరుగుల వద్ద ఔటైన హర్మన్‌ప్రీత్.. ఫైనల్లో టాప్ ఫామ్‌ను అందుకోవాలనుకుంటోంది. రోడ్రిగ్స్, పునియా, భాటియా కూడా రాణిస్తే సూపర్ సోవాస్ మరోసారి టైటిల్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ట్రయల్ బ్లేజర్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 39 పరుగులే చేసింది. కనీసం ఫైనల్ మ్యాచ్‌లో అయినా.. మంధాన తన స్థాయికి తగ్గట్లు ఆడాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకొంటోంది. తొలి మ్యాచ్‌లో వెలాసిటీని 47కే కుప్పకూల్చిన ట్రయల్ బ్లేజర్స్ శనివారం ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ఓపెనర్ డియాండ్రా డాటిన్ రాణిస్తోంది కానీ.. పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. సూపర్‌నోవాస్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దీప్తి శర్మ (43 నాటౌట్), హర్లీన్ (15 బంతుల్లో 27) మరోసారి సత్తా చాటాలని బ్లేజర్స్ ఆశిస్తోంది. రిచా ఘోష్, హేమలత, హర్లీన్ డియోల్ ఫామ్ అందుకుంటే మంధాన సేనకు తిరుగుండదు.