నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వస్తూ.. విమానంలోనే యువతి మృతి

నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వస్తూ.. విమానంలోనే యువతి మృతి

By Srikanth Gundamalla  Published on  2 July 2024 1:10 AM GMT
woman died,  india, flight,

నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వస్తూ.. విమానంలోనే యువతి మృతి 

ఆస్ట్రేలియాకు ఉన్న చదువు కోసం వెళ్లిన ఓ యువతి.. దాదాపు 4 నాలుగేళ్ల తర్వాత తన సొంతగడ్డ భారత్‌కు తిరుగుపయనం అయ్యింది. తల్లిదండ్రులు, బంధువులను కలిసేందుకు పయనం అయ్యింది. కానీ.. అంతలోనే ఆమెను మృత్యువు అడ్డుకుంది. తల్లిదండ్రులను చూడకముందే అనంతలోకాలకు తీసుకెళ్లింది. కుమార్తె అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జూన్ 20వ తేదీన మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత్‌కు చెందిన మన్‌ప్రీత్‌ కౌర్‌ 2020లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. అప్పుడు ఆమె వయస్సు 20 ఏళ్లు. కుకింగ్ అంటే ఇష్టపడే మన్‌ప్రీత్‌కు చెఫ్ కావాలనేది కల. ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేస్తూనే.. వంటకు సంబంధించిన కోర్సులు చేస్తోంది. కోవిడ్ విజృంభణ సమయంలో ఆస్ట్రేలియాలోనే ఉంది మన్‌ప్రీత్. కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. సుమారు నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి బయల్దేరింది. జూన్‌ 20న మెల్‌బోర్న్‌ విమానాశ్రయానికి వచ్చింది. మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ వచ్చే క్వాంటాస్ విమానం ఎక్కింది. విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో టేకాఫ్‌ కావాల్సి ఉంది. విమాన సిబ్బంది సీటు బెల్టు పెట్టుకోవాలనే సూచనలు చేస్తున్నారు. అందరూ సీటు బెల్టులు పెట్టుకున్నారు కానీ.. మన్‌ప్రీత్‌ మాత్రం ఆ పనిచేయలేదు. దాంతో.. విమాన సిబ్బంది యువతి దగ్గరకు వచ్చారు. ఆమెను కదిలించగానే సీటు ముందుభాగం వైపు పడిపోయింది. మన్‌ప్రీత్ కౌర్‌ కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు, రూమ్‌మేట్ కుల్దీప్ తెలిపాడు. వాస్తవానికి ఎయిర్‌పోర్టుకు వచ్చే సమయంలోనే మన్‌ప్రీత్ అస్వస్థతకు గురైందట. చికిత్స తీసుకోవడంతో ఆరోగ్య పరిస్థితి కుదటపడడంతో ప్రయాణానికి సిద్ధమైందని కుల్దీప్ చెప్పాడు.

Next Story