సికింద్రాబాద్-విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందేభారత్ రైలు
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మరికొన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 5:25 AM GMTసికింద్రాబాద్-విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందేభారత్ రైలు
దేశంలో రైల్వేకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు. ఇండియన్ రైల్వే కొంతకాలం ముందు వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి సదుపాయాలతో పాటు ఇతర రైళ్లతో పోలిస్తే మరింత వేగంగా గమ్యస్థానాలకు చేర్చడమే వీటి ఉద్దేశం. వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఈ రైళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మరికొన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో కొన్నింటిని ఆయన జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగానే 10 వందే భారత్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో ఒకటే సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రయాణించే రైలు. ఇప్పటికే ఈ సర్వీసు ఒకటి అందుబాటులో ఉండగా.. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కింది. ఇక తాజాగా ప్రదాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వందేభారత్ రైళ్లతో దేశంలో వీటి సంఖ్య 51 చేరాయి.
ప్రధాని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను కూడా ప్రారంభించారు. వందేభారత్ రైళ్లను చూసినట్లు అయితే.. సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్‌ను ప్రారంభించారు. దీనితో పాటు కలబురగి-బెంగళూరు, లక్నో-డెహ్రాడూన్, పట్నా-లక్నో, న్యూజల్‌పాయ్‌గుడి-పట్నా, పూరి-విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజురహో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై, మైసూరు-చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రైళ్లతో దేశంలో మొత్తం వందేభారత్ సర్వీసులు 51కి చేరాయి.