తెలంగాణకు మరో వందేభారత్ రైలు, ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తెలంగాణ గడ్డ నుంచి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 9:00 AM ISTతెలంగాణ గడ్డ నుంచి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రారంభం కాబోతుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వందేభారత్ రైలు ప్రారంభం కాబోతుంది. ఆయన ఈ రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఇది ఐదో రైలు కాబోతుంది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్-నాగ్‌పుర్ మధ్య 578 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగుతుంది. ఈ దూరాన్ని వందేభారత్ ఏడు గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేయనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగ్‌పుర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.15గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. రాత్రి 8.20గంటలకు నాగ్‌పుర్ చేరుకుంటుందని చేరుకుంటుంది. సికింద్రాబాద్-నాగ్‌పుర్ మార్గంలో నడిచే ఈ వందేభారత్ రైలు.. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రాపుర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది.
కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇందు కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో చైర్‌కార్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్లీపర్ క్లాస్‌లను కూడా తీసుకొచ్చి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన జర్నీని అందించేందుకు కృషి చేస్తున్నారు.