విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌లో పనిచేయని ఏసీలు.. ప్రయాణికులకు ఇక్కట్లు
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2023 10:00 AM ISTవిశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌లో పనిచేయని ఏసీలు.. ప్రయాణికులకు ఇక్కట్లు
కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దేశంలో ఇప్పటికే పలు మార్గాల్లో ఈ వందేభారత్ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్ రైళ్లు ప్రారంభం అయినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఒక చోట గేదెను ఢీకొని ముందు భాగం ధ్వంసమైతే.. ఇంకోచోట చెట్ల కొమ్మలు తగిలి కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి.. మొన్నటికి మొన్న కేరళలో వర్షాలకు వందేభారత్ రైలు లీకై రైలు బోగిలోకి నీళ్లు వెళ్లాయి. తాజాగా మన తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న వందేభారత్ రైలు సాంకేతిక సమస్యకు గురైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 5:45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో.. ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. అంటే ఉదయం 10:45 గంటలకు విశాఖ నుంచి స్టార్ట్ అయ్యింది. బాగా ఆలస్యం కావడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు బయల్దేరాక కాసేపటికే కొన్ని బోగీల్లో ఏసీలు పని చేయలేదు. దీంతో.. కొందరు ప్రయాణికులు సహనాన్ని కోల్పోయారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వందేభారత్ కిటికీలు ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటాయి. ఇదీ అందరికీ తెలిసిందే. గాలి ఆడక ఏసీలు పనిచేయని బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. కొందరైతే రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.
వందేభారత్ రైలు రాజమండ్రికి చేరుకున్నాక కొందరు టెక్నీషియన్లు ఏసీల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఆతర్వాత మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ స్టేషన్‌లోనూ మరోసారి ప్రయత్నించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి చివరకు ఏసీలు పనిచేసేలా చేశారు. సాయంత్రం 5:30 గంటకలు రైలు విజయవాడ నుంచి బయల్దేరింది. హైస్పీడ్ వేగంతో ప్రయాణికులను తొందరగా గమ్యస్థానలకు చేర్చడమే లక్ష్యంగా వచ్చిన వందేభారత్ రైలు ఇలా ఆలస్యం కావడం.. సాంకేతిక సమస్యలు తోడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు ముందుగానే ఇవన్నీ చూసుకోవాని సూచిస్తున్నారు.