హైదరాబాద్ మెట్రోలో 59/- కే రోజంతా ప్రయాణం

By -  Nellutla Kavitha |  Published on  31 March 2022 4:50 PM GMT
హైదరాబాద్ మెట్రోలో 59/- కే రోజంతా ప్రయాణం

ఒకపక్క RTC మరోపక్క మెట్రోరైల్ ప్రయాణికులకోసం సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 59 రూపాయలకే ఒకరోజంతా మెట్రోలో ప్రయాణించొచ్చు. కానీ ఒక కండిషన్, అదేంటో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడండి.

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ భయం లేకుండా సందర్శించాలనుకునేవారికి హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును తీసుకొచ్చంది. జస్ట్ రూ.59 తో మెట్రోలో భాగ్యనగరాన్ని చుట్టేయొచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే. ప్రతి రోజూ అయితే మాత్రం కాదు. పూర్తి వివరాలను L&T మెట్రో MD కేవీబీ రెడ్డి వెల్లడించారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డుతో ఈ నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. 57 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లలో ఎక్కడయినా ఎక్కి, ఎక్కడయినా దిగిపోవచ్చు. అయితే రోజుూ కాకుండా, ప్రతీ ఆదివారం, ప్రతీ రెండు, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి…ఇలా మెుత్తం 100 సెలవు రోజుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని అని కేవీబీ రెడ్డి ప్రకటించారు.

కరోనా పాండెమిక్ పరిస్థితులు, లాక్ డౌన్ తర్వాత తిరిగి హైదరాబాద్ లో మెట్రో గాడిలో పడుతోందని, లాక్ డౌన్ సమయంలో ఎక్కువ రోజులు రైళ్లు నిలిపివేయాల్సి రావడంతో నష్టాలు వచ్చాయన్నారాయన. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో, మళ్లీ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగి ప్రస్తుతం 60 శాతం వరకు రద్దీ ఉందని, ప్రయాణికుల కోసమే ఈ ఆఫర్ తెచ్చినట్టుగా రెడ్డి చెప్పారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును అందరూ ఉపయోగించుకోవాని కోరుతున్నాం అన్నారు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి.

ఇక ఏప్రిల్ 2, ఉగాది రోజు నుంచి హైదరాబాద్ మెట్రో సూపర్‌ సేవర్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. సూపర్‌ సేవర్‌ కార్డుతో న‌గ‌రంలో ఎక్కడినుంచైనా ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. రోజంతా దీన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు ఊపందుకున్నాయి. ఇక ప్రయాణికులను మరింతగా ఆకర్శించేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story