ఆర్టీసీ డ్రైవర్‌కు బీపీ డౌన్.. బస్సు బోల్తా, ప్రయాణికులు సేఫ్

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. టీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.

By Srikanth Gundamalla  Published on  19 Feb 2024 4:47 PM IST
tsrtc, bus accident, BP down,  driver ,

ఆర్టీసీ డ్రైవర్‌కు బీపీ డౌన్.. బస్సు బోల్తా, ప్రయాణికులు సేఫ్

ఆంద్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. టీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. అయితే.. బస్సు డ్రైవర్‌గా ఉన్న భాస్కర్‌రావుకి డ్రైవింగ్‌లో ఉండగానే ఒక్కసారిగా బీపీ డౌన్‌ అయ్యింది. దాంతో.. అతను బస్సు నడపడంపై నియంత్రణ కోల్పోయాడు. ఆ తర్వాత బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ తర్వాత బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 21 మంద ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు, అంబులెన్స్‌లకు సమాచారం ఇచ్చారు. దాంతో.. అంబులెన్స్‌లు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయిస్తున్నారు. అన్నవరం ఎస్‌ఐ కిశోర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇక ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పూర్తిగా ద్వంసం అయ్యాయి.

బస్సు బోల్తా పడ్డ స్థలంలోనే విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయి. బస్సుకు విద్యుత్ తీగలు తాకి ఉంటే ఘోరం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల టీఎస్‌ఆర్టీసీకి చెందిన డ్రైవర్లు.. విధుల్లో ఉండగానే అనారోగ్యానికి గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ బస్సు రన్నింగ్‌లో ఉండగానే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నల్డొండ జిల్లాలో మరో డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

Next Story