భారత్ సహా 16 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు
By - Nellutla Kavitha | Published on 23 May 2022 4:11 PM ISTప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వివిధ దేశాల్లో మంకీ పాక్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ విజృభించకుండా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది.
16 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. దీంతో జీరో కేసుల దిశగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఆంక్షలు విధిస్తున్నట్టు సౌదీ అరేబియా తెలిపింది. ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో అది మరింత పెరిగే అవకాశం ఉంటుందని సౌదీ అరేబియా ఆరోగ్య శాఖా మంత్రి అబ్దుల్లా అసిరి అన్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మంకీ పాక్స్, కోవిడ్ కేసులు అధికంగా ఉన్న దేశాల నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించినట్టు ప్రకటించారు.
ఒకవైపు కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతుండగానే, మరోవైపు మంకీ పాక్స్ సరికొత్తగా భయపెడుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి వివిధ దేశాల్లో మళ్లీ పెరుగుతోంది. దీంతో పాటే మంకా పాక్స్ కేసుల సంఖ్య కూడా వివిధ దేశాల్లో పెరుగుతూ కనిపిస్తోంది. సరికొత్తగా కరోనా వైరస్ కి సంబంధించి ఉప వేరియంట్లు కూడా బయట పడుతున్నాయి. భారతదేశంలో కూడా BA4, BA5 వేరియంట్లు బయటపడినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణ ఆంక్షలు కూడా మొదలు పెట్టింది సౌదీ అరేబియా. తమ దేశ పౌరులు భారత్ సహా 16 దేశాల కు వెళ్లకుండా సౌదీఅరేబియా బ్యాన్ విధించింది.
ఈ ఆంక్షల జాబితాలో లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, యమన్ ,ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, సోమాలియా, లిబియా, వియత్నాం, వియత్నాం, ఇండోనేషియా, వెనిజులా, బెలారస్, ఆర్మేనియా ఉన్నట్లు సౌదీ అరేబియాలోని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కనిపిస్తున్న మంకీ పాక్స్ తరహా కేసులు తమ దగ్గర నమోదు కాకపోయినప్పటికీ, ఒకవేళ నమోదైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు గా ప్రజలకు భరోసా ఇచ్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం.