దేశంలో రూ.100 దాటేసిన కిలో టమాటా ధర

దేశంలో కొద్ది రోజులుగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  7 July 2024 6:24 AM GMT
tomato, rate hike,  India, kg rs.100,

దేశంలో రూ.100 దాటేసిన కిలో టమాటా ధర 

దేశంలో కొద్ది రోజులుగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాకాలం వచ్చినా కూడా.. దిగుమతి తక్కువగా ఉండటంతో ధరలు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరిగిన టమాటా ధర అస్సలు తగ్గడం లేదు. తాజాగా టమాటా ధర దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.100ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ సహా ఉత్తరాధి ప్రాంతాల్లోని అనేక చోట్ల కిలో టమాటా ధర కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.130 వరకు పలుకుతోంది.

గత నెలలో ఢిల్లీలోని రిటైల్ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.28 నుంచి రూ.50 వరకు ఉండగా ప్రస్తుతం మాత్రం సెంచరీని దాటేసింది. టమాటా ధరలు భారీగా పెరిగిన ప్రాంతాల లిస్ట్‌లో అండమాన్, నికోబార్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అండమాన్ నికోబార్‌లో టమాటా అత్యధికంగా కిలో రూ.115.67గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో కిలో టమాటా ధర రూ.50 నుంచి 60 రూపాయల మధ్య ఉంది.

టమాటా ధరలతో పాటు ఉల్లి ధరలు కూడా మంటపుట్టిస్తున్నాయి. ఢిల్లీలో గత నెలలో కిలో ఉల్లిపాయ ధర రూ.32గా ఉంటే.. ఇప్పుడు 53 రూపాయలకు పెరిగింది. మిజోరం, అండమాన్ నికోబార్, నాగాలాండ్, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ 60 రూపాయలకు చేరింది. ఉల్లి ధర అండమాన్ నికోబార్‌లో హైగా ఉంది. కిలో ఉల్లి అక్కడ రూ.60.67గా కొనసాగుతోంది. బంగాళదుంప కిలో రూ.40 గా ఉంది. అండమాన్‌ నికోబార్‌లో మాత్రం రూ.58.33గా ఉన్నాయి. కేరళలో బంగాళదుంప కిలో రూ.47, తమిళనాడులో రూ.45.65, పుదుచ్చేరిలో రూ.43, మిజోరంలో రూ.40.27గా ఉన్నాయి. ఇక దిగుబడి పెరిగే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పడకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story