పాకిస్తాన్‌లో మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్ట్‌ హతం

భారత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ.. నిత్యం వార్తలో ఉండే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 12:31 PM IST
terrorist, murdered,  pakistan,

 పాకిస్తాన్‌లో మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్ట్‌ హతం

భారత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ.. నిత్యం వార్తలో ఉండే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మాజీ కమాండర్‌ అక్రమ్‌ ఖాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌లో కాల్చి చంపారు. అతని సొంతగడ్డపై గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. అక్రమ్ ఖాన్ ని అక్రమ్ గాజీ అని కూడా పిలుస్తారు.

కాగా అక్రమ్‌ ఖాన్‌ 2018 నుంచి 2020 వరకు ఎల్‌ఈటీ రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించాడు. పాకిస్తాన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడంలో అక్రమ్ ఖాన్ పేరుగాంచాడు. అంతేకాదు గతంలో అనేక తీవ్రవాద కార్యకాలాపాల్లోనూ పాల్గొన్నాడు. ర్రికూట్‌మెంట్‌ సెల్‌ అధిపతిగా ఉన్న సమయంలో సానుభూతిగల వ్యక్తులను గుర్తించి వారిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకపాత్ర వహించాడు.

అక్టోబర్‌లో పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ను పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గుజ్రాన్‌వాలా నగరంలో నివసిస్తున్న లతీఫ్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోకి చొరబడిన నలుగురు ఉగ్రవాదులకు కమాండర్ గా వ్యవహరించాడు. సెప్టెంబరులో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఉగ్రవాదిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌గా గుర్తించారు. ఇలా వరుసబెట్టి సొంతగడ్డపై ఉగ్రవాదులు హతమవుతుండటం పాకిస్థాన్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Next Story