కర్ణాటక చెన్నకేశవ స్సామి రథోత్సవానికి ముందు ఖురాన్ పఠనం
By - Nellutla Kavitha | Published on 14 April 2022 12:55 PM GMTహిజాబ్ నిషేధం, హలాల్ వివాదం, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపు వంటి అంశాలతో ఇటీవలి కాలంలో కర్ణాటకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ హసన్ జిల్లా బేలూరులో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయం మతసామరస్యాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తోంది. దశాబ్దాలుగా కొనుసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి ఈసారి కూడా ఖురాన్ పఠనంతో చెన్నకేశవస్వామి రథయాత్ర యాత్ర ప్రారంభం అయింది. వాదోపవాదాలు, వివాదాలు చోటుచేసుకున్నా ఖురాన్ పఠనంతోనే కార్యక్రమం ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్ణాటకలోని చెన్నకేశవ ఆలయంలో ఏటా నిర్వహించే రథోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. పన్నెండవ శతాబ్దానికి చెందిన హొయసల రాజు విష్ణువర్ధనుడు 1116 లో చోళులపై తాము సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనికి ఆయన విజయ నారాయణగా నామకరణం చేశారు. ప్రతీ అటా ఇక్కడ రథోత్సవం వైభవంగా జరుగుతుంది. దాదాపు రెండు వందల ఏళ్లుగా చెన్నకేశవ స్వామి రథోత్సవం ప్రారంభ సమయానికి ముందు ఖురాన్ పఠనం కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వివాదాల నేపథ్యంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించకూడదని కొంతమంది ఖురాన్ పఠనాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ దేవాలయ పాలక మండలి మాత్రం ఆ సంప్రదాయాన్ని ఈసారి కూడా పాటించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా చెన్నకేశవ స్వామి దేవాలయంలో రథోత్సవం జరగనందున ఈసారి జరుగుతున్న రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఖురాన్ పట్టించే సంప్రదాయం వద్దని హిందూ వాదులు, కొన్ని సంస్థలు పట్టుపట్టడంతో దేవాలయ పాలక మండలి, అక్కడి ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరిని సంప్రదించింది. హిందూ రెలిజియస్ యాక్ట్ 2002 లోని సెక్షన్ 58 ప్రకారం మతాచారాలు, సంప్రదాయాలలో ఇంకొకరు కలుగజేసుకోవటం కుదరదని, దేవాలయ సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చని చెప్పడంతో దేవాలయం ఖురాన్ పఠనం వైపే మొగ్గు చూపింది.
చెన్నకేశవ స్వామి దేవాలయంలో రెండు రోజులపాటు కొనసాగే రథోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రథోత్సవం ప్రారంభం సందర్భంగా ముస్లింలు సంప్రదాయ బద్ధంగా ఖురాన్ పఠనం చేపట్టారు. ముస్లిం మతగురువు ఖాజీ సయ్యద్ సాజీద్ పాషా ప్రారంభానికి ముందు ఖురాన్ పఠించారు. అయితే హిందూ సంఘాలు వ్యతిరేకించినా దేవాలయ పాలక మండలి ఖురాన్ పఠనం కొనసాగించాలని నిర్ణయంతీసుకుని, సంప్రదాయాన్ని కొనసాగించడానికే నిర్వాహకులు మొగ్గుచూపడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.