బలవుతుంది కార్యకర్తలేనా.. ఎండ్ కార్డు పడేది ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బలమైన రెండు పార్టీలు ఉంటాయి. వాటిలో ఒకటి అధికారంలో ఉంటే మరొకటి ప్రతి పక్షం.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 11:30 AM GMTబలవుతుంది కార్యకర్తలేనా.. ఎండ్ కార్డు పడేది ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బలమైన రెండు పార్టీలు ఉంటాయి. వాటిలో ఒకటి అధికారంలో ఉంటే మరొకటి ప్రతి పక్షం. ఆయా పార్టీల అధినేతలు బాగానే ఉంటారు.. కానీ కార్యకర్తలే అన్యాయం అవుతూ ఉన్నారు. ఏపీలో చూస్తే ప్రాంతీయ పార్టీలకి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలే బలం. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు తమ గ్రామాలకు వస్తున్నారంటే కార్యకర్తలు చేసే సందడి అంతా ఇంతా ఉండదు. ఏదో తమ ఇంట్లో ఫంక్షన్ జరిగినంతగా ఫీల్ అవుతూ ఉంటారు. తమ పార్టీ వాళ్లు ఎలా ఉన్నారు.. ఎలాంటివి చేస్తే న్యూట్రల్ ఓటర్ల ఓట్లు పడతాయోనని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు.
ఇక గొడవల విషయంలో కూడా మొదట బలయ్యేది వీరే. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకుడికి గొడవలు జరిగితే స్థానికంగా వీళ్లు కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు. అదే ఊర్లో ఉండే తమకు తెలిసిన వాళ్లతోనో, బంధువులలనో కూడా చూడరు. అవతలి పార్టీకి చెందిన వారైతే చాలు.. ఇక గొడవలు మొదలవుతాయి. వాళ్ళల్లో వాళ్లు కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ పొలిటికల్ గొడవలు కాస్తా పర్సనల్ గొడవలుగా మారుతాయి. సొంతమనుషులనే పార్టీల కారణంగా దూరం పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఒకప్పటి మనుషులలో ఉండే స్వభావం అనుకుంటే తప్పే.. ఇప్పుడు 20-30లలో ఉన్న తర్వాతి జెనరేషన్ కూడా అదేలా భావిస్తోంది. పైన ఉన్న బడా నాయకులు.. జైలుకు వెళ్లడం, బెయిల్ మీద బయటకు రావడం. పార్టీ మారితే కేసులు కొట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కింద ఉన్న కార్యకర్తలు ప్రాణాలు పోతున్నాయి.. కుటుంబాలను అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి.